Rahul Gandhi: అధ్యక్ష పదవిని పరిగణిస్తానన్న రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని ఆ పార్టీ ప్రధాన నేత రాహుల్‌ గాంధీ సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ.....

Updated : 17 Oct 2021 09:38 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి విషయంలో ఆ పార్టీ ప్రధాన నేత రాహుల్‌ గాంధీ సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ.. అధ్యక్ష పదవిని స్వీకరించే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటానని పేర్కొన్నట్లు సమాచారం. అధ్యక్ష పదవిని స్వీకరించాలని పంజాబ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రులతోపాటు రక్షణశాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీలు రాహుల్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ పదవిపై రాహుల్‌ సానుకూలంగా స్పందించారని ఆ సమావేశంలో పాల్గొన్న పలువురు మంత్రులు వెల్లడించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాభవం అనంతరం కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌ గాంధీ ఆ పదవికి రాజీనామా చేశారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అధ్యక్ష పదవిలోనే కొనసాగాలని రాహుల్‌ను అనేక మంది కాంగ్రెస్‌ నేతలు కోరినప్పటికీ ఆ బాధ్యతలను వీడేందుకు ఆయన మొగ్గుచూపారు.

అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరదించారు. తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలినని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక, లఖింపుర్ ఘటన, పలు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు..తదితర అంశాలే అజెండాగా సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. జూన్ 30లోపు పార్టీ అధినేతను ఎన్నుకోవాల్సి ఉండగా, కొవిడ్ రెండో వేవ్‌ కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడినట్లు చెప్పారు. అలాగే పూర్తిస్థాయి సంస్థాగత ఎన్నికల సంబంధించి స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీకి అధినేతను ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని