Published : 16 May 2022 01:53 IST

Chintan Shivir: అది కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉంది : రాహుల్‌ గాంధీ

చింతన శిబిరం ముగింపులో కాంగ్రెస్‌ నేత ప్రసంగం

దిల్లీ: భారతీయ జనతా పార్టీలో దళితులకు సరైన స్థానమే లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కానీ, కాంగ్రెస్‌ మాత్రం అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇస్తుందన్న ఆయన.. నేరుగా ప్రజలతోనే సంబంధం అనేది కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉందన్నారు. రాజస్థాన్‌ ఉదయ్‌పుర్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ చింతన్‌ శిబిరం ముగింపు సందర్భంగా మాట్లాడిన రాహుల్‌ గాంధీ.. స్వాతంత్ర్యం పూర్వం నుంచి తమపార్టీ ప్రజలతోనే మమేకమై ఉందన్నారు.

‘ప్రజలతో పార్టీకి సంబంధాలు తెగిపోయాయన్న విషయాన్ని అంగీకరించాలి. అదే సమయంలో దేశాన్ని ముందుకు నడిపించే సత్తా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందనే విశ్వాసం ప్రజలకు ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలతో  మళ్లీ సత్సంబంధాలను ఏర్పచుకునేందుకు షార్ట్‌కట్‌ ఏదీ లేదు. అందుకోసం శ్రమించాల్సిందే. ఇందుకు కేవలం ఒకటి, రెండు రోజులు సరిపోదు. నెలలపాటు కష్టపడాల్సిందే’ అని చింతన్‌ శిబిరంలోపాల్గొన్న నేతలను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఇక తాను ఎన్నడూ అవినీతికి పాల్పడలేదన్న ఆయన భాజపాకు భయపడే ప్రసక్తే లేదన్నారు.  భాజపాపై పోరాటం కొనసాగిస్తానని ఉద్ఘాటించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ మాదిరిగా ప్రాంతీయ పార్టీలు పోరాటం చేయలేవన్న రాహుల్‌ గాంధీ.. భాజపా కూడా ఎప్పుడూ కాంగ్రెస్‌ గురించే మాట్లాడుతుందన్నారు.

ఇక పార్టీ వ్యూహాల్లో కొంత అంతరాలు ఉన్నాయని అంగీకరించిన రాహుల్‌ గాంధీ.. భాజపా కేవలం కమ్యూనికేషన్‌లోనే మెరుగ్గా ఉండవచ్చనన్నారు. భాజపాకు భారీ స్థాయిలో డబ్బు ఉన్నందునే ప్రజలతో మెరుగ్గా కమ్యూనికేట్‌ చేయగలుగుతోందన్నారు. ఈ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. ఇక కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన రాహుల్‌ గాంధీ, దేశ వ్యవస్థలను భాజపా నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్‌ వంటి రాజ్యాంగబద్ధ వ్యవస్థలను కూడా తప్పుదోవ పట్టిస్తోందన్న ఆయన.. వాటి నోరు మూయించేందుకు పెగాసస్‌ స్పైవేర్‌ వంటిని ఆయుధాలుగా వాడుకుంటోందని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని