Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీని (Rahul Gandhi) ఇండియా కూటమి (India Bloc) ఎంపిక చేసింది.

Updated : 25 Jun 2024 22:28 IST

దిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీని (Rahul Gandhi) ఇండియా కూటమి (India Bloc) ఎంపిక చేసింది. ఈ మేరకు కూటమి నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ..  ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మెహతాబ్‌కు లేఖ ద్వారా పంపినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ (KC Venugopal) వెల్లడించారు. అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) నివాసంలో ఇండియా కూటమి నేతలంతా సమావేశమయ్యారు. ప్రతిపక్ష నేతగా రాహుల్‌ని ఎంపిక చేయడంతోపాటు స్పీకర్‌ ఎన్నిక నేపథ్యంలో బుధవారం చేపట్టబోయే కార్యాచరణ గురించి చర్చించారు. 

లోక్‌సభ స్పీకర్‌ అంశంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరక.. సభాపతి ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ప్రతిపక్ష కూటమినంతా ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత బాధ్యతలను రాహుల్ స్వీకరించారు. ఇటీవల దిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఆయన్ని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసినప్పటికీ.. రాహుల్‌ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. తాజాగా ఇండియా కూటమి నేతలంతా రాహుల్‌ పేరును బలపరచడంతో ఆయన బాధ్యతలు స్వీకరించేందుకు ముందుకొచ్చారు. 

రాహుల్‌ గాంధీ ఇప్పటి వరకు ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వయనాడ్‌ నుంచి కూడా గెలుపొందినప్పటికీ.. తాజాగా ఆ స్థానానికి రాజీనామా చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఆ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్షానికి కేటాయించాలన్న డిమాండ్‌కు అధికార ఎన్డీయే అంగీకరించకపోవడంతో స్పీకర్‌ పదవికి ప్రతిపక్షం తరఫున కాంగ్రెస్‌ ఎంపీ కె. సురేశ్‌ను బరిలోకి దించింది. బుధవారం స్పీకర్‌ ఎన్నిక జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని