Rahul Gandhi: మీ ప్రేమే నన్ను కాపాడింది

కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గాన్ని వదిలిపెట్టడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అక్కడి ప్రజలకు ఆదివారం భావోద్వేగంతో ఓ లేఖ రాశారు.

Published : 24 Jun 2024 03:46 IST

మీరంతా నా కుటుంబం.. ఎల్లప్పుడూ అండగా ఉంటా
వయనాడ్‌ ప్రజలకు రాహుల్‌ భావోద్వేగ లేఖ

వయనాడ్‌: కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గాన్ని వదిలిపెట్టడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అక్కడి ప్రజలకు ఆదివారం భావోద్వేగంతో ఓ లేఖ రాశారు. అందులో నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి.. ‘‘ప్రియమైన వయనాడ్‌ సోదరసోదరీమణులారా.. మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మీడియా ముందు నా నిర్ణయాన్ని (వయనాడ్‌ను వదులుకుంటున్నట్లు) ప్రకటిస్తున్నప్పుడు నా కళ్లను ఆవరించిన విచారాన్ని మీరు చూశారు. నాకెందుకు అంత దుఃఖం కలిగిందో తెలుసా?.. అయిదేళ్ల క్రితం నేను మిమ్మల్ని కలిశాను. మీ మద్దతు కోరేందుకు తొలిసారి మీ వద్దకు వచ్చాను. అప్పటికి నేను మీకు కొత్త వ్యక్తిని. అయినా మీరు నాపై విశ్వాసం చూపారు. మీ అవ్యాజమైన ప్రేమ, ఆప్యాయతలతో నన్ను హత్తుకున్నారు. మీరు ఏ రాజకీయ పార్టీకి మద్దతిచ్చేవారైనా..ఏ కులం, మతం, భాష వారైనా.. నేను వేధింపులను ఎదుర్కొంటున్న రోజుల్లో మీరు నాపై చూపిన అవ్యాజమైన ప్రేమే నన్ను రక్షించింది. కేరళలో వరదల సమయంలో ఎదురైన పరిస్థితులను ఎప్పటికీ మర్చిపోలేను. ఎన్నో కుటుంబాలు తమ జీవితాలను కోల్పోయినా, యావదాస్తులు గంగలో కొట్టుకుపోయినా మీలో ఏ ఒక్కరూ హుందాతనాన్ని కోల్పోలేదు. మళ్లీ నన్ను గెలిపించారు. మీ అంతులేని ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటా. వేలాది మంది ప్రజల ఎదుట నా ప్రసంగాలను అనువాదం చేసిన ధైర్యసాహసాలు కలిగిన ధీర యువతుల విశ్వాసాన్ని ఎలా మర్చిపోగలను? పార్లమెంటులో మీ ప్రతినిధిగా వ్యవహరించడం నాకు ఎంతో ఆనందాన్నీ, గౌరవాన్నీ ఇచ్చింది. అలాంటిది ఇప్పుడు నేను మిమ్మల్ని వదులుకోవాల్సిరావడం నాకు విచారం కలిగిస్తోంది. అయితే మీకు ప్రతినిధిగా ఉండాలని నా సోదరి ప్రియాంకా గాంధీ భావిస్తుండటం నాకు ధైర్యాన్ని కలిగిస్తోంది. మీ ఎంపీగా ఆమెకు మీరు అవకాశం కల్పిస్తే ఆమె మీ తరఫున గొప్పగా విధులు నిర్వహిస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గంలోనూ ఇక్కడిలాగే ఆదరాభిమానాలు చూపించే ప్రజలున్నారు. మీకూ, రాయబరేలీ ప్రజలకు ఒకే మాట ఇస్తున్నా.. దేశంలో వ్యాప్తి చెందుతున్న విద్వేషం, హింసపై పోరాడి వాటిని ఓడిస్తా. అత్యవసర సమయంలో మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. మీరంతా నా కుటుంబ సభ్యులే. మీ అందరికీ ఎప్పుడూ అండగా ఉంటా.. ధన్యవాదాలు’’ అంటూ రాహుల్‌ తన లేఖను ముగించారు.

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో గెలుపొందిన రాహుల్‌ గాంధీ వయనాడ్‌ స్థానాన్ని వదులుకున్నారు. ఉప ఎన్నికలో ఆ లోక్‌సభ బరి నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని అభ్యర్థిగా నిలపాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని