Published : 21 Jun 2021 01:18 IST

Congress: అధ్యక్షుడు కాకపోయినా రాహులే మన నేత

సొంత పార్టీలోని జి-23 వర్గంపై సల్మాన్‌ ఖుర్షీద్‌ మండిపాటు

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో సంస్కరణలు కోరుతూ గతంలో అధిష్ఠానానికి లేఖ రాసి జి-23గా ముద్రపడ్డ సొంత పార్టీ వర్గంపై తాజాగా సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ మండిపడ్డారు. పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని బహిరంగంగా డిమాండ్‌ చేయడాన్ని తప్పుబట్టారు. లేఖ రాసిన వారంతా ప్రస్తుతం వారున్న హోదాలకు ఎన్నికల వల్లే ఎదిగారా? అని ప్రశ్నించారు. సంస్కరణలు త్యాగాల వల్లే సాధ్యమని.. ఆకస్మికంగా ప్రశ్నించడం వల్ల కాదని హితవు పలికారు.

‘కాంగ్రెస్ పార్టీకి పెద్దాపరేషన్‌ చేయాలి’అంటూ జి-23 వర్గంలోని నేత వీరప్ప మొయిలీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనికి స్పందనగానే ఖుర్షీద్‌ తాజా వ్యాఖ్యలు చేశారు. అద్భుతమైన వాక్యాలు పరిష్కారం చూపలేవని ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లుగా పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలకు చర్చల ద్వారా ఓ పరిష్కారం చూపాలని హితవు పలికారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలా? లేదా? అనేది రాహుల్‌ గాంధీయే నిర్ణయించుకుంటారని తెలిపారు. అయితే,  పార్టీ అధ్యక్షుడి స్థానంలో ఉన్నా.. లేకపోయినా.. ఆయనే పార్టీ నాయకుడని వ్యాఖ్యానించారు.

‘‘పార్టీకి ఆపరేషన్‌ చేద్దాం, సంస్కరణలు తీసుకొద్దాం, సంస్థాగతంగా మార్పులు చేద్దాం.. అనడంలో ఉద్దేశమేంటనేది నాకు అర్థం కావడం లేదు. దీనిపై వాళ్లు(జి-23) స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరుతున్నా. పార్టీ పదవుల్లో మార్పులు చేసి వారికి కీలక పదవులు కట్టబెట్టాలనేది వారి ఉద్దేశమా?ఆపరేషన్‌, సంస్కరణలు అనడంలో వారి అర్థం అదేనా? ఒకవేళ  అదే వారు కోరుకుంటే దాన్ని వారు సంస్కరణలు, ఆపరేషన్లు అనడం సబబు కాదు. అది కేవలం ‘నాకు పదవి కావాలి అని కోరుకోవడమే’ అవుతుంది. అందుకే దీనిపై చర్చ జరగాలి అంటున్నాను’’ అని సల్మాన్‌ ఖుర్షీద్‌ అభిప్రాయపడ్డారు. పార్టీలో సంస్కరణలు కోరుకుంటున్నవారు ఈ విషయాన్ని పార్టీలోని ఇతర నేతలతో ముందే చర్చించి ఉండాల్సిందన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్దదని.. ఒకవేళ పార్టీలో ప్రతి స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలంటే ‘భారత ఎన్నికల  సంఘం’వలే ఓ ప్రత్యేక వ్యవస్థే కావాల్సి వస్తుందన్నారు. పార్టీలో సంస్కరణలు కావాలనుకుంటే కూర్చొని మాట్లాడాలని.. మీడియా దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

అయినప్పటికీ అంతర్గత ఎన్నికల నిర్వహణకు వెనుకాడడం లేదని ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు. గుమికూడి ఓటు వేసే పరిస్థితులు ఇప్పుడు లేవని తెలిపారు. పార్టీకి, దేశానికి ఏది మంచిదో అదిష్ఠానానికి బాగా తెలుసని.. దీనిపై తుది నిర్ణయం వారే తీసుకుంటారన్నారు. అలాగే కొవిడ్‌ సంక్షోభంలో అహ్మద్‌ పటేల్‌, మోతీలాల్‌ వోరా వంటి కీలక నేతలు మరణించడం కూడా పార్టీ ఎన్నికల నిర్వహణలో జాప్యానికి ఓ కారణమని అభిప్రాయపడ్డారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని