Rahul Gandhi: దేశ సగం సంపదంతా 100 మంది చేతుల్లోనే..!

దేశ సంపదలో సగం కేవలం 100 మంది చేతుల్లోనే ఉందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డ ఆయన.. నరేంద్ర మోదీ నాయకత్వంలో సామాన్యుడికి మిగులుతోంది శూన్యమని దుయ్యబట్టారు.

Published : 06 Jan 2023 20:46 IST

దిల్లీ: భారత్‌ జోడో యాత్రను (Bharat Jodo Yatra) కొనసాగిస్తోన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi).. కేంద్రంలో భాజపా ప్రభుత్వ విధానాలపై మరోసారి మండిపడ్డారు. మొన్నటివరకు నోట్లరద్దు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ఆయన.. తాజాగా అగ్నిపథ్‌, జీఎస్టీలపై ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టారు. పాదయాత్రలో భాగంగా హరియాణాలో పర్యటిస్తున్న రాహుల్‌ గాంధీ.. కేవలం కొంతమంది సంపన్నులకే ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వ విధానాలున్నాయంటూ దుయ్యబట్టారు.

‘ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో రెండు భారత్‌లు ఉన్నాయి. ఒకటి రైతులు, కార్మికులు, చిన్న దుకాణాలతో పాటు నిరుద్యోగులది. దేశంలోని సగం సంపద పోగుపడి ఉన్న 100 మందిది రెండోది. లాభాల్లో 90శాతం 20 కంపెనీల్లోనే ఉంది. కానీ, సామాన్యుడి చేతిలో మాత్రం శూన్యం. నోట్లరద్దు, జీఎస్టీలు కేవలం ప్రభుత్వ విధానాలే కాదు.. అవి చిన్న, మధ్యతరహా వ్యాపారాలను నాశనం చేసే ఆయుధాలు. ఇక అగ్నిపథ్‌ అంటే అర్థమేంటో నాకు తెలియదు. దేశభక్తులని చెప్పుకొనే భాజపా నేతలు దాని గురించి విడమరిచి చెప్పాలి’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

హరియాణాలోని భాజపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ.. దేశంలో అత్యంత నిరుద్యోగిత రేటు ఉన్న రాష్ట్రం ఇదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 38శాతంగా ఉందన్న రాహుల్‌ గాంధీ.. ‘21శతాబ్దంలో నిరుద్యోగంలో హరియాణా ఛాంపియన్‌గా నిలిచింది. దేశంలో అన్ని రాష్ట్రాలను మించిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు