Raj Thackeray: ‘లౌడ్‌ స్పీకర్స్‌’ తొలగించకుంటే ‘హనుమాన్‌ చాలీసా’ వినిపిస్తాం: రాజ్‌ఠాక్రే

మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే మరోసారి లౌడ్‌స్పీకర్ల అంశాన్ని లేవనెత్తారు.

Published : 18 Apr 2022 02:13 IST

పుణె: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే మరోసారి ‘లౌడ్‌స్పీకర్ల’ అంశాన్ని లేవనెత్తారు. మే 3వ తేదీలోగా మసీదులపై లౌడ్‌స్పీకర్లను తొలగించాల్సిందేనని చెప్పారు. అయితే, దీన్నో మతపరమైన అంశంగా కాకుండా ఓ సామాజిక సమస్యగా చూడాలని హితవు పలికారు. ఒకవేళ నిర్దేశించిన గడువులోగా తొలగించకుంటే తాము కూడా భక్తి గీతాలను లౌడ్‌స్పీకర్లలో వినిపించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల అంశం ఓ మతపరమైనదని చాలామంది అనుకుంటారు. కానీ ఇదో సామాజిక సమస్య. మీరు రోజుకు ఐదు సార్లు లౌడ్‌స్పీకర్లలో  ప్రార్థనలు మొదలుపెడితే మేం కూడా హనుమాన్‌ చాలీసా వినిపించాల్సి ఉంటుంది. రంజాన్‌ మాసం (మే 3) ముగిసే వరకు వేచి చూస్తాం. ఆ లోగా లౌడ్‌స్పీకర్లు తొలగించాల్సిందే. హిందూ సోదరులు కూడా దీనికి సిద్ధంగా ఉండాలి. మతపరమైన ఘర్షణలను ఎంఎన్‌ఎస్‌ కోరుకోదు. దేశంలో శాంతికి విఘాతం కలగకూడదనేది మా అభిమతం’’ అని రాజ్‌ఠాక్రే అన్నారు. తాము వారి ప్రార్థనలను వ్యతిరేకించడం లేదని, కేవలం లౌడ్‌స్పీకర్లను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

జూన్‌ నెల 5న తాను అయోధ్యను సందర్శించనున్నట్లు ఈ సందర్భంగా రాజ్‌ఠాక్రే తెలిపారు. తనతో పాటు కొందరు ఎంఎన్‌ఎస్‌ వాలంటీర్లు కూడా వస్తారని తెలిపారు. అయితే, అయోధ్య పర్యటన వెనుక ఉద్దేశం ఏమిటని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కాస్త వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. తాను బయటకు వెళ్లి చాలా రోజులైందని పేర్కొన్నారు. అలాగే, ‘న్యూ హిందు ఓవైసీ’ అంటూ శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా.. అలాంటి వ్యక్తుల కామెంట్లపై స్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని