Raj Thackeray: ఉద్ధవ్‌ వర్గం అభ్యర్థికి మద్దతుగా.. భాజపాకు రాజ్‌ఠాక్రే ప్రత్యేక విజ్ఞప్తి

అంధేరీ ఈస్ట్‌ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకూడదని విజ్ఞప్తి చేస్తూ మహారాష్ట్ర నవ్‌నిర్మాన్‌ సేన చీఫ్‌ రాజ్‌ ఠాక్రే, ఆరాష్ట్ర భాజపా అగ్రనేత, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు లేఖ రాశారు.

Published : 17 Oct 2022 01:30 IST

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అంధేరీ ఈస్ట్‌ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకూడదని విజ్ఞప్తి చేస్తూ మహారాష్ట్ర నవ్‌నిర్మాన్‌ సేన (MNS) చీఫ్‌ రాజ్‌ ఠాక్రే (Raj Thackeray) ఆ రాష్ట్ర భాజపా అగ్రనేత, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు లేఖ రాశారు. మహారాష్ట్ర పాటిస్తోన్న సంప్రదాయాన్ని అనుసరించి తన విన్నపానికి ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నానని.. తద్వారా ప్రజా ప్రతినిధికి నివాళి అర్పించినట్లవుతుందని రాజ్‌ ఠాక్రే అందులో పేర్కొన్నారు. అయితే, ఉద్ధవ్‌ వర్గం (Shiv Sena) అభ్యర్థి కోసం ఎంఎన్‌ఎస్‌ అధినేత రాజ్‌ ఠాక్రే.. భాజపాను ప్రత్యేకంగా కోరడం విశేషం.

మై డియర్‌ దేవేంద్ర, ప్రత్యేక విజ్ఞప్తితో ఈ లేఖ రాస్తున్నాను అంటూ మొదలు పెట్టిన రాజ్‌ ఠాక్రే.. ‘ఇటీవల ప్రాణాలు కోల్పోయిన రమేష్‌ లట్కే.. క్షేత్రస్థాయి (శాఖా ప్రముఖ్‌) నుంచి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఎంతో కష్టపడి ఆయన రాజకీయాల్లో ఎదగడాన్ని నేను ప్రత్యక్ష్యంగా చూశాను. ఇటీవల రమేష్‌ మరణించడం.. తాజా ఉప ఎన్నికల్లో ఆయన భార్య పోటీలో నిలబడ్డారు. ఆమె గెలుపే రమేష్‌కు ఆత్మశాంతి. అంతేకాకుండా ఆయనకు మనమిచ్చే నివాళి కూడా అదే’ అంటూ అందులో పేర్కొన్నారు. తాము ఇప్పటికే పోటీకి దూరంగా ఉన్నామని.. భాజపా తరఫున పోటీలో నిలపకూడదని ప్రత్యేకంగా విన్నవిస్తున్నానని ఫడణవీస్‌కు రాజ్‌ ఠాక్రే విజ్ఞప్తి చేశారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని