Sachin Pilot: అవినీతిని ప్రశ్నించకపోతే.. ఎన్నికల్లో గెలవలేం: సచిన్‌ పైలట్‌

అవినీతిని ప్రశ్నించకపోతే ఎన్నికల్లో విజయం సాధించలేమని రాజస్థాన్‌ (Rajasthan) మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ (Sachin Pilot) అన్నారు. రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా అజ్మేర్‌ నుంచి జైపుర్‌ వరకు చేపట్టిన పాదయాత్ర రెండో రోజుకు చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 13 May 2023 00:23 IST

జైపుర్‌: కర్ణాటక (Karnataka Elections 2023)లో భాజపా (BJP) ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించడం వల్లనే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) గెలవబోతోందని రాజస్థాన్‌ మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) అన్నారు. జన్‌ సంఘర్ష్‌ యాత్ర (Jan Sangharsh Yatra) పేరుతో అజ్మేర్‌ నుంచి జైపుర్‌ వరకు ఆయన చేపట్టిన పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మరోసారి సీఎం అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేశారు. 

‘‘కర్ణాటకలో 40శాతం కమీషనుపై భాజపా ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించాం. కాబట్టే, అక్కడ కాంగ్రెస్‌ గెలవబోతోంది. సీఎం బొమ్మై ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేయడం వల్లనే అక్కడి ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీపై నమ్మకం కలిగింది. అదేపనిని మనం రాజస్థాన్‌లో కూడా చేయాలి. ఈ నాలుగున్నర ఏళ్లలో పని చేయకపోతే, ప్రజలకు పార్టీపై ఎలా నమ్మకాన్ని కల్పిస్తాం. నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. ఏ ఒక్కరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడంలేదు. ఈ యాత్ర యువత ఆశయాల కోసం అవినీతికి వ్యతిరేకంగా చేపట్టాను. ఆరు నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో ప్రజలు ఏం చెప్పి ఓట్లు అడుగుతాం?’’ అని సచిన్‌ పైలట్‌ ప్రశ్నించారు. 

గత కొంత కాలంగా రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాలు తరచూ పొడచూపుతున్నాయి. మాజీ సీఎం, భాజపా నేత వసుంధర రాజే (Vasundhara Raje) తన ప్రభుత్వాన్ని కాపాడారంటూ ఇటీవల గహ్లోత్‌ వ్యాఖ్యానించగా.. ఆమెను గహ్లోత్‌ తన నాయకురాలిగా భావిస్తున్నారంటూ పైలట్‌ మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే అవినీతికి, రాష్ట్రంలో పోటీ పరీక్షల పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా పైలట్ గురువారం పాదయాత్రను ప్రారంభించారు. వర్గ విభేదాలను సృష్టించేవారు ఎప్పటికీ విజయం సాధించలేరని, పార్టీకి విధేయులుగా ఉండలేరని సచిన్‌ పైలట్‌ను ఉద్దేశించి ఓ కార్యక్రమంలో సీఎం అశోక్ గహ్లోత్‌ వ్యాఖ్యానించారు. సచిన్‌ పైలట్‌ చేపట్టిన యాత్ర పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, పార్టీతో ఎలాంటి సంబంధంలేదని రాజస్థాన్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు