Published : 28 Apr 2022 16:13 IST

Sachin Pilot: వెంటనే సీఎం పదవి ఇస్తారా లేదా?.. కాంగ్రెస్‌కు సచిన్‌ పైలట్ డిమాండ్‌

జైపూర్‌: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మరో కుదుపు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్‌ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. లేదంటే పంజాబ్‌లో మాదిరిగానే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని చెప్పినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లో నాయకత్వ మార్పు జరగనున్నట్లు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోన్న వేళ.. తాజా కథనాలు ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.

ఇటీవల సచిన్‌ పైలట్‌ పలు మార్లు దిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చర్చలు జరిపారు. సోనియా గాంధీతో పాటు రాహుల్‌, ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు. మరో ఏడాదిన్నరలో రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తనకు తక్షణమే సీఎం పగ్గాలు అప్పగించాలని పైలట్‌.. కాంగ్రెస్‌ హైకమాండ్‌ను డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యంగా చేసిన పంజాబ్‌ పరిణామాలు రాజస్థాన్‌లో  పునరావృతమవుతాయని హెచ్చరించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

పైలట్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ అనేక ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తానని ఆఫర్‌ చేసినట్టు సమాచారం. అయితే తాను రాజస్థాన్‌ వీడి రాలేనని పైలట్‌ గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. అది కాదంటే.. రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడిని చేస్తామని హైకమాండ్‌ మాట ఇచ్చింది.పై రెండు ఆఫర్లు వద్దంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పైలట్‌ నేతృత్వంలోనే కాంగ్రెస్‌ ఎన్నికలకు వెళ్తుందని, ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం పదవి చేపట్టొచ్చని హైకమాండ్‌ చెప్పినట్లు సమాచారం. వీటిని కూడా పైలట్ తిరస్కరించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో తాను ఐదేళ్ల పాటు రాజస్థాన్ కాంగ్రెస్‌ చీఫ్‌గా వ్యవహరించానని, అప్పుడే 2018లో కాంగ్రెస్‌ గెలిచిందని చెప్పారట.

ఇప్పటికే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో దిగులులో కూరుకుపోయిన హస్తం పార్టీకి పైలట్‌ డిమాండ్‌ కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. దీనిపై ఎమ్మెల్యేలు, రాజస్థాన్‌ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి హైకమాండ్‌ నిర్ణయం తీసుకోనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మే 13-15వ తేదీల్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ చింతన్‌  శిబిరం నిర్వహించనుంది. దీని అనంతరం పార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

మరోవైపు సీఎం మార్పు ఊహాగానాలపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఇటీవల స్పందించారు. రాజీనామా చేయాలని అధిష్ఠానం కోరితే అందుకు ఎప్పుడూ సిద్ధమేనన్నారు. తన రాజీనామా లేఖ ఎల్లప్పుడూ సోనియా గాంధీ వద్దే ఉంటుందని తెలిపారు.

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో అంతర్గతంగా వివాదాలు ఎప్పట్నుంచో కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం సీఎం అశోక్‌ గహ్లోత్‌కు వ్యతిరేకంగా పైలట్‌ సహా మరో 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో అశోక్‌, పైలట్‌ వర్గం మధ్య నెలకొన్న విభేదాలు ఈ అమస్మతికి కారణమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ అధిష్ఠానం పైలట్‌ను బుజ్జగించింది. పైలట్‌ వర్గీయులకు గెహ్లోత్‌ కేబినెట్‌లో చోటు కల్పించింది. ఈ వివాదం అప్పట్లో సద్దుమణిగినట్లే కన్పించినా.. గత నెల పైలట్‌ మళ్లీ గాంధీలను కలవడంతో మరోసారి ఊహాగానాలు జోరందుకున్నాయి. రాజస్థాన్‌లో 2023 డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts