Rajasthan crisis: రాహుల్‌జీ మీ జోడో యాత్ర సరే.. ముందు వారిద్దరిని కలపండి..!

అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోన్న వేళ రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కాంగ్రెస్‌ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది

Updated : 26 Sep 2022 11:04 IST

రాజస్థాన్‌ సంక్షోభం.. కాంగ్రెస్‌పై భాజపా సెటైర్లు

హస్తం పార్టీ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు సీనియర్ల యత్నాలు

జైపుర్‌: అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోన్న వేళ రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కాంగ్రెస్‌ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. రాజస్థాన్‌ సీఎం కుర్చీ సచిన్‌ పైలట్‌కు ఇచ్చేందుకు ససేమిరా అంటోన్న ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ వర్గీయులు మూకుమ్మడి రాజీనామాకు దిగారు. దీంతో వారిని బుజ్జగించేందుకు సీనియర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ స్పందిస్తూ.. కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. రాహుల్‌ జోడో యాత్రను ప్రస్తావిస్తూ.. ముందు రాజస్థాన్‌లో ఐక్యత తీసుకొచ్చుకోండి అంటూ ఎద్దేవా చేసింది.

రాజస్థాన్‌లో సంక్షోభ పరిస్థితులపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. గతంలో గహ్లోత్‌, పైలట్‌ కలిసి రాహుల్‌ గాంధీతో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘‘ముందు వీరిద్దరిని కలపండి’’ అంటూ సెటైర్‌ వేశారు. మరో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ స్పందిస్తూ.. ‘‘శిబిరాల ప్రభుత్వం. మరోసారి రిసార్టులకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది’’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో తాజా పరిస్థితులు.. రాష్ట్రపతి పాలన దిశగా సాగుతున్నాయని శాసనసభలో భాజపా డిప్యూటీ నేత రాజేంద్ర రాఠోడ్‌ అభిప్రాయపడ్దారు. ఇక రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలంటూ కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, ముఖ్యమంత్రి కూడా పదవి నుంచి దిగిపోయి అసెంబ్లీని రద్దు చేయాలని అన్నారు.

అధ్యక్ష ఎన్నికల తర్వాతే సీఎం ఎంపిక..?

రాజస్థాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దేందుకు హస్తం పార్టీ సీనియర్‌ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అధిష్ఠానం పరిశీలకులుగా జైపుర్‌కు వచ్చిన మల్లికార్జున్‌ ఖర్గే, అజయ్‌ మాకెన్‌.. గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గహ్లోత్‌ వర్గం అందుబాటులో లేదని తెలుస్తోంది. అంతేగాక, కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికల తర్వాతే రాజస్థాన్‌లో తదుపరి సీఎంను ఎంచుకోవాలని గహ్లోత్‌ వర్గం డిమాండ్‌ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

స్పీకర్‌ వద్ద రాజీనామాలు..

అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువచ్చే ఉద్దేశంతో.. గహ్లోత్‌కు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేసేందుకు 92 మంది ఎమ్మెల్యేలు సిద్ధపడినట్లు సమాచారం. నిన్న వీరంతా శాసనసభ స్పీకర్‌ సి.పి.జోషి నివాసానికి వెళ్లారు. రాజీనామాలపై స్పీకర్‌ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. కానీ, తాము రాజీనామాలు సమర్పించినట్లు రాష్ట్ర మంత్రి గోవింద్‌ రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. ‘‘పార్టీ అధ్యక్ష ఎన్నికల తర్వాతే తదుపరి సీఎంపై నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నారు’’ అని మేఘ్వాల్‌ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts