Rajnath Singh: కాంగ్రెస్‌ వైడ్‌బాల్‌, ఆప్‌ నోబాల్‌.. విపక్షాలపై రాజ్‌నాథ్‌ విమర్శలు!

హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విపక్షాలపై క్రికెట్ పరిభాషలో విమర్శలు చేశారు. సమాజాన్ని విభజించి ఎన్నికట్లో ఓట్లు పొందాల్సిన అవసరం భాజపాకు లేదని స్పష్టం చేశారు. 

Published : 08 Nov 2022 01:26 IST

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో అధికార భాజపా దూసుకెళ్తోంది. ఆదివారం ప్రధాని మోదీ బహిరంగసభలో పాల్గొనగా, సోమవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ బైజ్నాద్‌, బాల్హ్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలపై క్రికెట్ పరిభాషలో విమర్శలు చేశారు.  రాజకీయ పిచ్‌పై భాజపాను గుడ్‌ లెంగ్త్‌ డెలివరీ బంతిగా పేర్కొన్న రాజ్‌నాథ్‌, కాంగ్రెస్‌ను వైడ్‌ బాల్‌గా, ఆప్‌ను నోబాల్‌గా అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని భాజపా ఇప్పటికే ప్రకటించింది. ‘‘ ఎన్నికల్లో ఓట్ల కోసమే ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని లేవనెత్తామని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. సమాజాన్ని విభజించి ఓట్లు పొందాల్సిన అవసరం భాజపాకు లేదు. గోవాలో ఎన్నో సంవత్సరాలుగా ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది. అక్కడి సమాజం విడిపోలేదు’’ అని రాజ్‌నాథ్‌ గుర్తుచేశారు. 

ప్రధాని మోదీ పాలలో  దేశంలో అవినీతిని రూపుమాపి, ప్రతి పైసా లబ్దిదారుడు అందేలా భాజపా సర్కారు పనిచేస్తోందని అన్నారు. భారత రక్షణ ఎగుమతులు ₹ 20 వేల కోట్లకు చేరాయని మంత్రి తెలిపారు. ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఒకేపార్టీకి అధికారం కట్టబెట్టని హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు, ఈ సారి భాజపాకే తిరిగి అధికారం అప్పగించనున్నారని ధీమా వ్యక్తం చేశారు. భాజపా సర్కారు అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, మహిళా ఓటర్లు సైతం తమ పార్టీ వైపే మొగ్గుచూపుతున్నారని రాజ్‌నాథ్‌ అన్నారు. 

హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ నియోజక వర్గాలకు నవంబరు 12న ఎన్నికలు జరగనున్నాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే 43 స్థానాలు, కాంగ్రెస్ 22 స్థానాల్లో గెలుపొందాయి. అధికార భాజపా రెండోసారి గెలుపొంది అధికార మార్పిడి సంప్రదాయానికి చెక్ పెట్టాలని చూస్తుంటే, కాంగ్రెస్‌ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. మరోవైపు, పంజాబ్‌ ఎన్నికల గెలుపుతో జోష్‌ మీదున్న ఆప్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని