Rahul Gandhi: ఓటమిని గ్రహించే ప్రచారానికి దూరం.. రాహుల్‌పై కేంద్రమంత్రి సెటైర్‌..!

ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో రాహుల్‌ గాంధీ కన్పించకపోవడం విచిత్రంగా ఉందని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ప్రచారానికి దూరంగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు.

Published : 19 Nov 2022 12:39 IST

సూరత్‌: భారత్‌ జోడో యాత్రలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రచారానికి దూరంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఇది హస్తం పార్టీ కొత్త వ్యూహమా? లేదా కొత్త రాజనీతా? అని తెలుసుకోవాలని ఉందంటూ ఎద్దేవా చేశారు.

కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సూరత్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో రాహుల్‌ గాంధీ కన్పించకపోవడం విచిత్రంగా ఉంది. ఈ ఎన్నికల్లో (గుజరాత్‌, హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశిస్తూ) కాంగ్రెస్‌ ఓడిపోతుందని ఆ పార్టీకి తెలుసు. అందుకే ఆ నిందను గాంధీ కుటుంబంపై కాకుండా పార్టీ కొత్త అధ్యక్షుడిపై నెట్టాలనుకుంటున్నారు. కాంగ్రెస్‌ ప్రాభవం తగ్గిపోతోంది. అందుకే వారు(గాంధీ కుటుంబసభ్యులు) ఎక్కడా కన్పించట్లేదు. అయితే రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం చేయకపోవడం.. కాంగ్రెస్‌ రన్నీతీ (వ్యూహం) అనుకోవాలా లేదా.. కొత్త రాజనీతి అనుకోవాలా?’’ అంటూ ఘాటుగా విమర్శించారు.

ఇక, గుజరాత్‌ ఎన్నికల్లో భాజపా మరోసారి భారీ మోజార్టీతో విజయం సాధిస్తుందని అనురాగ్‌ ఠాకూర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. సావర్కర్‌ లాంటి గొప్ప వ్యక్తులను అవమానించే వారిని గుజరాత్‌ ప్రజలు ఎన్నడూ గెలిపించబోరన్నారు. గుజరాత్‌లో డిసెంబరు 1, 5వ తేదీల్లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 8న ఫలితాలను వెల్లడించనున్నారు.

దేశానికి ఐక్యం చేయాలనే లక్ష్యంతో భారత్‌ జోడో యాత్రకు నేతృత్వం వహిస్తున్న రాహుల్‌ గాంధీ.. ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఇక, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రచార తారల జాబితాలో రాహుల్ పేరు ఉన్నప్పటికీ.. ఆయన రాష్ట్రంలో ప్రచారం చేపట్టే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని