‘ఒక్కమంత్రే ₹100కోట్లా.. మరి ప్రభుత్వం ఎంతో?’ 

మహారాష్ట్రలోని ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వంపై కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తీవ్రస్థాయిలో  మండిపడ్డారు. అక్కడి ప్రభుత్వం ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే ఏకైక లక్ష్యంగా........

Published : 23 Mar 2021 19:03 IST

ఉద్ధవ్‌ సర్కార్‌పై మండిపడిన కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

దిల్లీ: మహారాష్ట్రలోని ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వంపై కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తీవ్రస్థాయిలో  మండిపడ్డారు. అక్కడి ప్రభుత్వం ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అది మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ ప్రభుత్వం కాదని, మహారాష్ట్ర వసూలీ అఘాడీ అని ఎద్దేవా చేశారు. ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంవీర్‌ సింగ్‌ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై చేసిన ఆరోపణలపై స్పందించిన రవిశంకర్‌ ప్రసాద్‌..  ఒక్కమంత్రే రూ.100 కోట్లు అడిగితే, మొత్తం ప్రభుత్వం ఎంత అడిగి ఉంటుందోనని సందేహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో బదిలీ రాకెట్‌ను వెలికి తీసిన ఐపీఎస్‌ అధికారిణి రష్మీ శుక్లాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. మహారాష్ట్రలో బదిలీ, పోస్టింగ్‌ రాకెట్‌ నడుస్తోందన్నారు. ఉద్దవ్‌ ఠాక్రే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తాము భావించామని, అయితే, ప్రభుత్వం మాత్రం అందుకు బదులుగా రష్మీ శుక్లాపై చర్యలు తీసుకుందని మండిపడ్డారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్థాల వాహనం కేసులో పోలీస్‌ అధికారి సచిన్‌ వాజే అరెస్టు, పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ బదిలీ, ఆ క్రమంలోనే అనిల్‌ దేశ్‌ముఖ్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పరమ్‌వీర్‌ శనివారం ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాయడం కల్లోలం రేపిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని