Shiv Sena: టార్గెట్‌ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!

మహారాష్ట్రలో భాజపా రాజకీయ ప్రణాళికలో ఇప్పటి వరకు చూసింది కేవలం ట్రైలర్‌ వంటిదే. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీ భారీ వ్యూహాన్నే అనుసరిస్తోంది. దీనిలో భాగంగా

Updated : 04 Jul 2022 14:28 IST

 కుంభస్థలానికి గురిపెట్టిన భాజపా

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

మహారాష్ట్రలో భాజపా రాజకీయ ప్రణాళికలో ఇప్పటి వరకూ చూసింది కేవలం ట్రైలరే. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీ భారీ వ్యూహాన్నే అనుసరిస్తోంది. దీనిలో భాగంగా శివసేనను చీల్చి రెబల్స్‌కు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించింది. దేవేంద్ర ఫడణవీస్‌ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించేలా అధినాయకత్వం ఒప్పించింది. మహారాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రులుగా చేసిన వారు తర్వాత సాధారణ మంత్రులుగా చేసిన సందర్భాలున్నాయి. గతంలో నారాయణ్‌ రాణే, అశోక్‌ చవాన్‌లే దీనికి ఉదాహరణలు. ఈ నేపథ్యంలో ఫడణవీస్‌ ఇమేజ్‌కు వచ్చే మచ్చ ఏమీలేదు.

శిందే పూర్తిగా భాజపా ఎంపికే..

గతంలో భాజపా నాయకత్వాన్ని అబద్ధాల కోరులుగా ఉద్ధవ్‌ ఠాక్రే అభివర్ణించారు. అంతేకాదు.. 2019లో భాజపాను వీడి కాంగ్రెస్‌, ఎన్సీపీలతో జట్టుకట్టారు. ఈ విషయాలను కమలనాథులు బాగా గుర్తుపెట్టుకొన్నారు. ఇప్పుడు ఉద్ధవ్‌ను పార్టీ పరంగా పూర్తిగా బలహీనపర్చే వ్యూహాన్ని అమల్లోకి తెచ్చారు. శివసేనను చీల్చకుండానే.. శిందే రూపంలో రెబల్‌ శివసైనికుడికి సీఎం పదవిని అప్పగించారు. ఫలితంగా కార్యకర్తల్లో శిందే పలుకుబడి గణనీయంగా పెరిగి.. రాజకీయంగా ఉద్దవ్‌ పలుకుబడి తగ్గిపోతుంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. అధికారాన్ని లాక్కొన్నారని శివసైనికులు భాజపాపై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం లేదు. 2024 ఎన్నికలకు ముందు శిందే వర్గం ఏ స్థాయిలో బలపడిందో తెలుసుకొనేందుకు బీఎంసీ ఎన్నికలే లిట్మస్‌ టెస్ట్‌గా నిలవనున్నాయి.

ఠాక్రే కుటుంబ పునాదులను కదలించేలా..

ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లలో బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు దాదాపు 15 మున్సిపల్‌ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తు, నగర్‌ పరిషత్‌లకు ఎన్నికలు జరుగుతాయి. వీటిల్లో చాలా వరకు స్థానిక సంస్థల్లో ఠాక్రే కుటుంబానికి మంచి పట్టుంది. ఇవే ఆ కుటుంబానికి బలం, పలుకుబడి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో బడ్జెట్‌ కలిగి ఉన్న బీఎంసీపై శివసేన పట్టు తగ్గించడం భాజపాకు కీలకంగా మారింది. తాజాగా శివసేన రెబల్స్‌ చేతికి సీఎం పగ్గాలు వెళ్లడంతో స్థానిక సంస్థల్లో ఠాక్రే కుటుంబ ప్రభావాన్ని తగ్గించడం భాజపాకు సులువవుతుంది. దీనికి తోడు ఏక్‌నాథ్‌ శిందేకు ఠాణే, కల్యాణ్‌-డోంబివాలి మహానగర్‌ పాలికల్లో మంచి పట్టుండటం భాజపాకు కలిసొచ్చే అంశం.

అంతేకాదు భవిష్యత్తులో పార్టీ గుర్తు కోసం జరిగే న్యాయ పోరాటంలో రెబల్స్‌కు మద్దతు పెరగాలంటే సీఎం కుర్చీ శిందే చేతిలో ఉండటమే సరైన నిర్ణయంగా భాజపా అధినాయకత్వం భావించింది. పార్టీ గుర్తును, నిధులను ఉద్ధవ్‌ నుంచి దూరం చేస్తే సగం విజయం సాధించినట్లే అని ఫడణవీస్‌ వర్గం భావిస్తోంది.

ఫలితం ఏదైనా విజయం భాజపాకే దక్కేలా వ్యూహం..

భాజపా, శివసేనలకు హిందుత్వ అజెండా ప్రధానం. 1989లో భాజపా-శివసేన తొలిసారి జట్టుకట్టాయి. ఆ తర్వాత వీరి భాగస్వామ్యంలో 1995-99, 2014-19లలో రాష్ట్రంలో అధికారం దక్కించుకొంది. కానీ, 2014-19 భాజపా బాగా బలపడటంతో  శివసేనతో విభేదాలు మొదలయ్యాయి. దీంతో 2017 బీఎంసీ ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోరాడాయి. 2019 ఎన్నికల్లో కలిసి పోరాడినా.. ఫలితాల అనంతరం ఉద్ధవ్‌ ఠాక్రే కాంగ్రెస్‌, ఎన్‌సీపీతో జట్టు కట్టేందుకు మొగ్గుచూపారు. దీంతో హిందుత్వకు తానే సారథిగా చెప్పుకునేలా అయాచిత వరం భాజపాకు దక్కింది. మరోవైపు తమ పునాదులు దెబ్బతింటాయనే భయం శివసేన నాయకుల్లో అంతర్గతంగా పెరిగిపోవడమే తిరుగుబాటుకు కారణమైంది. ఇది కూడా ఓ రకంగా కమలనాథులకు కలిసొచ్చే అంశమే. శివసేన కేడర్‌లో చీలికలు ఆ పార్టీని బలహీన పరుస్తాయి. భవిష్యత్తులో శిందే వర్గం, ఉద్ధవ్‌ వర్గాలకు ఎన్నికల్లో విజయాలు అంతతేలిగ్గా దక్కవు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆ స్థానాన్ని భాజపా భర్తీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని