Priyanka Chaturvedi: రాజకీయ సంక్షోభంపై బెదిరింపు కాల్స్‌.. పోలీసులను ఆశ్రయించిన శివసేన ఎంపీ

మహారాష్ట్ర రాజకీయాల్లో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray), తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde) మధ్య పోరు సాగుతోన్న వేళ.. శివసేన(Shivsena) ఎంపీ ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi)...

Published : 26 Jun 2022 01:26 IST

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray), తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde)ల మధ్య పోరు సాగుతోన్న వేళ.. శివసేన(Shivsena) ఎంపీ ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi) శనివారం పోలీసులను ఆశ్రయించారు. తనకు అసభ్య, బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల మీద శుక్రవారం నుంచి బెదిరింపు, అసభ్య కాల్స్‌ వస్తున్నాయి. ఈ విషయాన్ని ముంబయి(Mumbai) పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ పాండే దృష్టికి తీసుకెళ్లా. త్వరలో నిందితులను పట్టుకుంటారని ఆశిస్తున్నా’నంటూ ఆమె ఓ ట్వీట్‌ చేశారు.

హిందుత్వ సిద్ధాంతం నుంచి శివసేన దారిమళ్లుతోందంటూ ఇటీవల ఏక్‌నాథ్‌ శిందే చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక చతుర్వేది విరుచుకుపడిన విషయం తెలిసిందే. కుటుంబంలా ఉన్న పార్టీని వెన్నుపోటు పొడవాలని ఏ హిందుత్వ నేర్పుతుందంటూ మండిపడ్డారు. శిందే తిరుగుబాటుకు ఇది కారణం కాదని, ఆయన వెనుక భాజపా ఉందని ఆరోపించారు.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. శిందే వర్గం కొత్త పార్టీపై ప్రకటన చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. మరోపక్క అసమ్మతి ఎమ్మెల్యేల వైఖరిని నిరసిస్తూ.. శివసేన కార్యకర్తలు రాష్ట్రంలో పలు చోట్ల నిరసనలు చేపడుతున్నారు. దీంతో హోం శాఖ రాజధాని నగరం ముంబయిలో 144 సెక్షన్‌ విధించింది. హై అలర్ట్ ప్రకటించి, అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని