EPFO: ‘భాజపాను గెలిపించినందుకు ఇది రిటర్న్‌ గిఫ్టా?’

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) 2021-22 ఆర్థిక సంవత్సరానికి డిపాజిట్లపై పీఎఫ్‌ వడ్డీ రేటును తగ్గించాలని నిర్ణయించినట్టు ...

Published : 13 Mar 2022 01:27 IST

దిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) 2021-22 ఆర్థిక సంవత్సరానికి డిపాజిట్లపై పీఎఫ్‌ వడ్డీ రేటును తగ్గించాలని నిర్ణయించినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో స్పందించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు భాజపాకు ఇచ్చిన విజయానికి ఇది రిటర్న్‌ గిఫ్టా? అని ఎద్దేవా చేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ట్వీట్‌ చేశారు.  దేశంలో 84శాతం ప్రజల ఆదాయాలు తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో విజయాన్ని ఆసరాగా చేసుకొని కోట్లాది మంది ఉద్యోగుల పొదుపుపై దాడి చేయడం సరైందా? అని మండిపడ్డారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై గతేడాది 8.5శాతంగా ఉన్న వడ్డీ రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.1శాతానికి (నాలుగు దశాబ్దాల కనిష్ఠం) తగ్గించాలని ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ధర్మకర్తల మండలి ప్రతిపాదించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 

మరోవైపు, ఈ అంశంపై కేంద్రం తీరుపై సీపీఎం మండిపడింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ ప్రభుత్వం ప్రతీకారంతో శ్రామిక ప్రజలపై మరిన్ని దాడులకు  దిగుతోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఉద్యోగాలు కోల్పోవడం, ధరల పెరుగుదల వంటి కారణాలతో పెరుగుతున్న కష్టాల నేపథ్యంలో ఇలాంటి దాడుల్ని మన శక్తితో ప్రతిఘటించాలని ట్విటర్‌లో పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని