Rahul Gandhi: ఏదో తప్పు చేసిందన్న భయం వల్లే కేంద్రం అలా..: రాహుల్

ఎలాంటి చర్చ లేకుండా కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ చట్టాల రద్దుపై చర్చించేందుకు కేంద్రం.......

Published : 30 Nov 2021 01:44 IST

దిల్లీ: ఎలాంటి చర్చ లేకుండా కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ చట్టాల రద్దుపై చర్చించేందుకు కేంద్రం భయపడిపోయిందని, ఏదో తప్పు చేసిందని తెలియడం వల్లే ఇలా వ్యవహరించిందని మండిపడ్డారు. పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్షకులు, కార్మికుల శక్తి ముందు ముగ్గురు నలుగురు ఆశ్రిత పెట్టుబడిదారుల బలం నిలబడలేదని, ఈ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుంటుందని తమ పార్టీ ముందుగానే అంచనావేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ చట్టాల్ని కేంద్రం వెనక్కి తీసుకోవడం రైతుల, దేశ ప్రజల విజయంగా అభివర్ణించారు. 

అయితే, ఎలాంటి చర్చ జరపకుండా సాగు చట్టాల్ని రద్దు చేయడం దురదృష్టకరమని రాహుల్ అన్నారు. ఈ బిల్లులు తీసుకురావడం వెనుక ఉన్న శక్తుల గురించి చర్చించాలనుకున్నట్టు పేర్కొన్నారు. పండించిన పంటలకు కనీస మద్దతు ధరల అంశంతో పాటు లఖింపూర్‌ ఖేరి ఘటన, సాగుచట్టాల వ్యతిరేక ఉద్యమంలో అమరులైన 700 మంది రైతులు.. తదితర అంశాలపై చర్చించాలనుకున్నట్టు వివరించారు. కానీ, దురదృష్టవశాత్తు కేంద్రం చర్చకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు కావాలనే దాక్కొంటున్నట్టు, చర్చలకు భయపడిందనే అంశాన్ని ప్రతిబింబించిందన్నారు. చర్చలకు అనుమతించకపోతే ఇక పార్లమెంట్‌ సమావేశాలతో ప్రయోజనమేంటని ప్రశ్నించారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని