Maharashtra crisis: ముంబయికి రండి.. కూర్చొని మాట్లాడుకుందాం: రెబల్స్‌కు ఉద్ధవ్‌ విజ్ఞప్తి

మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం (Maharasthra political crisis) కొనసాగుతున్న వేళ క్షణం క్షణం ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.......

Published : 28 Jun 2022 16:21 IST

ముంబయి: మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం (Maharasthra political crisis) కొనసాగుతున్న వేళ క్షణం క్షణం ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ నుంచి తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు కొందరు టచ్‌లో ఉన్నారంటూ శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ (sanjay raut) వ్యాఖ్యానించగా.. అదంతా అవాస్తవమేనంటున్నారు తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్‌ శిందే. అంతేకాకుండా, పార్టీ అధిష్ఠానంతో టచ్‌లో ఉన్న ఆ ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారాయన. ఈ పరిణామాల క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే గువాహటిలోని స్టార్‌ హోటల్‌లో బస చేసిన రెబల్‌ ఎమ్మెల్యేలకు కీలక విజ్ఞప్తి చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా గువాహటి నుంచి ముంబయికి తిరిగి వచ్చి.. తనతో కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరుకుతుందని లేఖలో పేర్కొన్నారు.

‘‘మీలో చాలా మంది మాతో టచ్‌లో ఉన్నారు.. అంతేకాకుండా మీరంతా శివసేన గుండెల్లో ఉన్నారు. రండి.. మాట్లాడుకుందాం.. అప్పుడే ఒక పరిష్కారం దొరుకుతుంది’’ అన్నారు. ‘‘సమయం ఇంకా మించిపోలేదు. నాతో కూర్చొని మాట్లాడండి. తాజా పరిణామాలతో శివసైనికులు, ప్రజల్లో ఏర్పడిన అనేక సందేహాలను తొలగించాలి. ఎవరి మాటలకూ లొంగిపోవద్దు. శివసేన మీకు ఇచ్చిన గౌరవం మరెక్కడా దొరకదు. మీరు వచ్చి నాతో మాట్లాడితేనే ఏదో ఒక పరిష్కారం లభిస్తుంది. ఒక పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా మీ అందరి పట్ల నేను ఆందోళనతో ఉన్నా’’ అని ఉద్ధవ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని