Revanth Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పిన రేవంత్‌రెడ్డి

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పారు.

Updated : 13 Aug 2022 12:59 IST

హైదరాబాద్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పారు. నల్గొండ జిల్లా చుండూరు సభలో కోమటిరెడ్డిపై ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్‌ పరుష పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. పార్టీ నేతల తిట్లకు బాధ్యత వహిస్తూ రేవంత్‌ క్షమాపణ తెలియజేశారు. ఇలాంటి భాష వాడటం ఎవరికీ మంచిది కాదని రేవంత్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వెంకటరెడ్డికి క్షమాపణ చెబుతూ రేవంత్‌ ఓ వీడియో విడుదల చేశారు.

మునుగోడు ఉప ఎన్నిక వేళ పీసీసీ తీరుపై నిన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నిక కార్యక్రమాలపై పీసీసీ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. పిలవని పేరంటానికి తాను వెళ్లనని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక గురించి తనతో ఎవరూ మాట్లాడట్లేదని.. దాని గురించి తనకేం తెలియదని పేర్కొన్నారు. చండూరు సభలో ఓ పిల్లాడితో తనను తిట్టించారని.. అలా అవమానించేలా మాట్లాడిన వారు క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. సీనియర్‌ను తిట్టిన అతడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలన్నారు. ఇవాళ జరగనున్న కాంగ్రెస్‌ పాదయాత్రకు ఎవరూ పిలవలేదని.. ఇలా తనను అవమానించేలా మాట్లాడిన తర్వాత ఎలా వెళ్తానని కోమటిరెడ్డి ప్రశ్నించారు. తాజాగా రేవంత్ క్షమాపణలు చెప్పడంతో కోమటిరెడ్డి ఎలా స్పందించనున్నారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

రాతపూర్వకంగా క్షమాపణ చెప్పా..: అద్దంకి దయాకర్‌

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పడంపై ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ స్పందించారు. చండూరు సభలో తాను చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నట్లు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఔన్నత్యంతో తన తరఫున క్షమాపణలు చెప్పారన్నారు. సోదర భావంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కోసం పనిచేయాలని కోరారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు రాత పూర్వకంగా క్షమాపణ చెబుతూ వివరణ ఇచ్చినట్లు అద్దంకి దయాకర్‌ తెలిపారు. ఆ తర్వాత బహిరంగంగా క్షమాపణలు చెప్పానని.. ఇప్పుడు మరోసారి క్షమాపణలు చెప్తున్నట్లు పేర్కొన్నారు.



Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని