Revanth Reddy: 22 ఏళ్లకే ఇంటికి పంపిస్తే తర్వాత వారి పరిస్థితేంటి?: రేవంత్‌రెడ్డి

సికింద్రాబాద్‌ విధ్వంసం ఘటనలో నిందితులుగా ఉన్న నిరసనకారులతో కాంగ్రెస్‌ నేతలు ములాఖత్‌ అయ్యారు.

Updated : 24 Jun 2022 15:19 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ విధ్వంసం ఘటనలో నిందితులుగా ఉన్న నిరసనకారులతో కాంగ్రెస్‌ నేతలు ములాఖత్‌ అయ్యారు. చంచల్‌గూడ జైలులో ఉన్న నిరసనకారులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నేతలు మల్లు రవి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు కలిశారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. సమాజంలో ఏ వర్గంతోనూ చర్చించకుండా అగ్నిపథ్‌పై నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. యువత విషయంలో కీలకమైన ఈ నిర్ణయం తీసుకునే అంశంలో ప్రధాని మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.

 ‘‘దేశాన్ని రక్షిస్తున్న సైనికులను గత ప్రభుత్వాలు కీలకంగా భావించాయి. దేశభక్తి కలిగిన వేలమంది యువకులను సైన్యంలోకి తీసుకున్నారు. సైనికులకు ప్రత్యేకమైన గౌరవం దక్కేలా చట్టాల చేశాయి. కేవలం నాలుగేళ్ల కోసం యువకులను సైన్యంలోకి తీసుకోవడం సరికాదు. నాలుగేళ్లు పని చేయించుకుని 22 ఏళ్లకే ఇంటికి పంపిస్తే తర్వాత వారి పరిస్థితేంటి?మోదీ సర్కారు జవాన్లలో గందరగోళం సృష్టించింది’’ అని రేవంత్‌ ఆరోపించారు.

భవిష్యత్‌కు భద్రత లేకుండా అగ్నిపథ్ తీసుకొచ్చారు..

‘‘పార్లమెంట్‌లో చర్చించిన తర్వాత అగ్నిపథ్‌పై నిర్ణయం తీసుకుని ఉంటే ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి కాదు. సైన్యంలో పదవీ విరమణ తర్వాత ఉద్యోగ భద్రత ఉంటుంది. నాలుగు సంవత్సరాల కోసం రిక్రూట్ చేసే విధనంపై హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు. దేశ భద్రతకు ముప్పు వస్తుందనే యువత ఆందోళనలు చేస్తోంది. అడ్డమీది కూలీల మాదిరిగా సైన్యం కాకూడదు. భవిష్యత్‌కు భద్రత లేకుండా అగ్నిపథ్ తీసుకొచ్చారు. రెండేళ్ల శిక్షణలో నేర్చుకోవాల్సింది కేవలం 6 నెలల్లో నేర్పించడం సాధ్యమేనా?అలా చేసే వారు సమర్థులైన ఆర్మీ అధికారులు అవుతారా? దేశ భద్రత దృష్ట్యా అగ్నిపథ్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి’’ అని రేవంత్ డిమాండ్ చేశారు.

దేశ యువతకు మోదీ ఇచ్చే నజరానా ఇదేనా?

‘‘రిమాండ్‌లో ఉన్న యువకులకు సంబంధించి చాలా మంది తల్లిదండ్రులకు వారి పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియదు. సికింద్రాబాద్ అల్లర్ల కేసులో వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. భవిష్యత్‌లో ఉద్యోగాలు రాకుండా వారిపై నాన్ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. మేం ఎలాంటి విధ్వంసాలకు పాల్పడలేదని రిమాండ్‌లో ఉన్న ఆర్మీ అభ్యర్థులు చెప్తున్నారు. ఇంతమందిపై ఇంత గుడ్డిగా 307 ఐపీసీ కేసు ఎలా పెడతారు? దేశ యువతకు మోదీ ఇచ్చే నజరానా ఇదేనా? అగ్నిపథ్‌ను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. రైల్వే పోలీసులు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి 40రోజుల్లో కేసు దర్యాప్తును ముగించాలి. పార్లమెంట్ సమావేశాల్లో అగ్నిపథ్‌పై ప్రస్తావిస్తాం.
ఈనెల 27న అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తాం’’ అని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని