Published : 04 Jul 2022 01:54 IST

Revanth reddy: మోదీ ఉపన్యాసంతో శబ్ద కాలుష్యం తప్ప ఒరిగిందేమీ లేదు: రేవంత్‌రెడ్డి


హైదరాబాద్‌: భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం, బహిరంగ సభపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. విభజన హామీలపై ప్రధాని మోదీ నిర్దిష్ట ప్రకటన చేస్తారని ఆశించాం.. కానీ, ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలకు శబ్ద కాల్యుషం తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. 2014 రాష్ట్ర ఏర్పాటు సమయంలో గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్టీపీసీ 4వేల మెగావాట్ల పవర్‌ప్లాంట్‌, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్‌ ప్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. మోదీ ప్రసంగంలో ఆ ప్రస్తావనే లేదన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలకే దిక్కు లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టు అటకెక్కడంతో యువత లక్షలాది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. 

‘‘భాజపా అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామన్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా... ప్రతి బిల్లుకు 8ఏళ్లుగా తెరాస కేంద్రానికి మద్దతిచ్చింది. అభివృద్ధి విషయంలో మొండి చేయి చూపిన భాజపా.. కనీసం కేసీర్‌ కుటుంబ అవినీతిపై ప్రస్తావన తేలేదన్నారు. కాళేశ్వరం కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ఆరోపించారే తప్ప చర్యలు తీసుకోలేదు. గడిచిన మూడేళ్లుగా కేసీఆర్‌ అవినీతిపై భాజపా జాతీయ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర నాయకులు హెచ్చరికలు చేయడం తప్ప ఎలాంటి చర్యలు లేవు. భాజపా నాయకులు ప్రసంగాల్లో అధికారదాహం తప్ప తెలంగాణ త్యాగాలు, అమరవీరుల త్యాగాల గురించి ప్రస్తావన లేదు. తెలంగాణ పోరాట పటిమను ప్రస్తావించకపోగా.. రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా ఈ గడ్డ మీద నుంచే అమిత్‌ షా మాట్లాడటం దుస్సాహసం. అమిత్‌ షా తన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

భాజపా, తెరాస బాయ్‌ బాయ్‌..

మరోవైపు ప్రధాని ప్రసంగంపై ట్విట్టర్‌ ద్వారా కూడా స్పందించిన రేవంత్‌ రెడ్డి...తెలంగాణ మిత్రులారా....ప్రధాని మోదీ చీకటి మిత్రుడు కేసీఆర్‌ అని వ్యాఖ్యానించారు. కనీసం కేసీఆర్‌ పేరు కూడా ప్రస్తావించకుండా ప్రసంగం కొనసాగించారని, ఆయన కుటుంబపాలన గురించి కానీ, ఆయన అవినీతి గురించి కానీ,  ప్రస్తావించలేదని ఆరోపించారు. మోదీ మిత్ర ధర్మం ఎంత చక్కగా ఉందో చూశారా అని ఎద్దేవా చేశారు. భాజపా, తెరాసలు బాయ్‌ బాయ్‌ అని వ్యాఖ్యానించారు. 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని