Revanth Reddy: వీఆర్‌ఏలు ఆందోళన చెందొద్దు.. ప్రభుత్వంతో పోరాడుదాం: రేవంత్‌

రాష్ట్రంలోని వీఆర్‌ఏలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని.. వారి సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తామని పీసీసీ

Published : 06 Sep 2022 01:26 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వీఆర్‌ఏలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని.. వారి సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బొల్లారం గ్రామానికి చెందిన వీఆర్‌ఏ అశోక్ మృతిపట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అశోక్‌ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వీఆర్‌ఏలు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని.. ప్రభుత్వంతో పోరాడుదామని సూచించారు. ఈ అంశంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాట్లాడి అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు. వీఆర్‌ఏల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు వివరంగా లేఖ రాస్తామని చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వంతో కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలి: భట్టి

ప్రజా సమస్యలన్నింటిపైనా చర్చించేలా అసెంబ్లీ సమావేశాలు జరగాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. శాసనసభ సమావేశాలు కనీసం 20 రోజులైనా జరపాలని ఆయన కోరారు. సెప్టెంబర్‌ 17పై భాజపా, తెరాస రాజకీయం చేస్తున్నాయని భట్టి విమర్శించారు. మునుగోడులో కాంగ్రెస్‌దే విజయమని.. తెరాసకు రెండో స్థానమే దక్కుతుందని జోస్యం చెప్పారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా పాదయాత్రకు వెళ్లలేకపోతున్నానని తెలిపారు. కాగా.. పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని ఉపాధ్యాయ సంఘాలు భట్టిని కోరారు. సీఎల్పీ కార్యాలయంలో పలువురు ఉపాధ్యాయ నేతలు ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని