Revanth redddy: ఎంపీగా సచివాలయానికి వెళ్తే పోలీసులకు అభ్యంతరం ఏంటి?: రేవంత్‌ రెడ్డి

ఓఆర్‌ఆర్‌ టెండర్లకు సంబంధించి అధికారులను వివరాలు అడిగేందుకు సచివాలయానికి వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్‌.. ఎంపీగా సచివాలయానికి వెళ్తే పోలీసులకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు.

Published : 01 May 2023 18:51 IST

హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డు టెండర్లలో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ టెండర్లకు సంబంధించి అధికారులను వివరాలు అడిగేందుకు సచివాలయంలోని హెచ్‌ఎండీఏ విభాగానికి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ను కలిసేందుకు సచివాలయానికి వెళ్లిన రేవంత్‌ను.. అనుమతి తీసుకోలేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఓఆర్‌ఆర్‌ టెండర్ల అంశంపై అధికారులను కలుస్తానన్న రేవంత్‌.. టెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఒక సంస్థకు 30ఏళ్లకు ఇవ్వడంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా సెంట్రల్‌ జోన్‌ డీసీపీతో రేవంత్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఎంపీగా సచివాలయానికి వెళ్తే పోలీసులకు అభ్యంతరం ఏంటని డీసీపీని ప్రశ్నించారు. సచివాలయానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారని.. వినతి పత్రం ఇచ్చేందుకు ఎప్పుడు రావాలో తనకు అధికారులు ఎలా చెబుతారని నిలదీశారు.

అనంతరం మీడియాతో రేవంత్‌ మాట్లాడుతూ.. ఔటర్‌ రింగ్‌ రోడ్డులో అవినీతి బయటపడుతుందనే తనను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఓఆర్‌ఆర్‌ను కేసీఆర్, కేటీఆర్‌ అమ్ముకున్నారని ఆరోపించారు. సచివాలయంలోకి తానొక్కడే వెళ్లి అధికారులను కలుస్తానని, పోలీసు వాహనంలోనే తీసుకెళ్లాలని కోరినా అంగీకరించలేదని తెలిపారు. తనను అడ్డుకోవడం అప్రజాస్వామికం అన్న రేవంత్‌.. పోలీసుల తీరుపై మండిపడ్డారు. తర్వాత మాసబ్‌ట్యాంక్‌ మున్సిపల్‌ శాఖ పరిపాలన కార్యాలయానికి రేవంత్‌రెడ్డి వెళ్లారు. అక్కడి సెక్షన్‌ ఆఫీసర్‌కు ఆర్‌టీఐ దరఖాస్తు అందించి.. ఓఆర్‌ఆర్‌ టెండర్లకు సంబంధించిన సమాచారం, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇచ్చిన టెండర్ల వివరాలతో పాటు టెండర్‌లో పాల్గొన్న కంపెనీలు, అర్హత సాధించిన కంపెనీల వివరాలు ఇవ్వాలని కోరారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు