Revanth reddy: అక్రమాలు, పార్టీ ఫిరాయింపులకు అడ్డా.. ప్రగతిభవన్‌: రేవంత్‌

హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ పాదయాత్రలో రాష్ట్ర ప్రజలు తనతో ఎన్నో సమస్యలు చెప్పుకున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Published : 08 Feb 2023 20:44 IST

హైదరాబాద్‌: అక్రమాలకు, పార్టీ ఫిరాయింపులకు  ప్రగతిభవన్‌ అడ్డాగా మారిందని  పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth reddy) ఆరోపించారు. హాథ్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ పాదయాత్ర  3వ రోజు పెనుగొండ నుంచి ఈదులపూసపల్లి, మహబూబాబాద్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. మళ్లీ కాంగ్రెస్‌ వస్తేనే బాగుపడతామని ఆడబిడ్డలంటున్నారని చెప్పారు. ఎనిమిదో తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలకు రాలేదని చెప్తున్నారన్నారు. 

‘‘రాష్ట్రంలో ఉద్యోగులు ఎవరూ సంతోషంగా లేరు. హరితహారం పేరుతో పోడు భూములు,  మెడికల్‌ కాలేజీ పేరుతో పేదల భూములు గుంజుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే.. ఎంపీలు భూ కబ్జాలు చేస్తున్నారు. కలెక్టర్లకు, కౌన్సిలర్లకు, పేదలకు రాష్ట్రంలో రక్షణ లేదు. నకిలీ విత్తనాలతో రైతులను మోసగించిన వారిపై పీడీ యాక్ట్‌ ఎందుకు పెట్టరు? అప్పుల బాధతో 29 మంది రైతులు పురుగులమందు తాగి చనిపోయారు. జనవరి 1, 2024లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలిస్తాం. భూ నిర్వాసితులకు పరిహార బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిది. పోలీసు ఉద్యోగులకు వారంలో ఒక రోజు సెలవు కల్పిస్తాం’’ అని రేవంత్‌ హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని