Revanth reddy: అభివృద్ధి కోసమే అయితే.. ఆ నలుగురు ఎంపీలు రాజీనామా చేస్తారా?: రేవంత్‌ రెడ్డి

అభివృద్ధి కోసమే మునుగోడు ఉప ఎన్నిక అంటే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ నుంచే పోటీ చేయొచ్చు కదా?అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

Published : 21 Aug 2022 01:32 IST

చౌటుప్పల్‌: అభివృద్ధి కోసమే మునుగోడు ఉప ఎన్నిక అంటే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ నుంచే పోటీ చేయొచ్చు కదా?అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. తాను కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తానంటే బీ-ఫామ్‌ ఇస్తామని రేవంత్‌ స్పష్టం చేశారు. ఈమేరకు చౌటుప్పల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి కోసమే రాజీనామా అని చెబుతున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న నలుగురు భాజపా ఎంపీలు కూడా రాజీనామా చేస్తే 28 అసెంబ్లీ నియోజక వర్గాలు అభివృద్ధి చెందుతాయి కదా! అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేస్తున్న భాజపా ఆ నలుగురు ఎంపీలతో కూడా రాజీనామా చేయిస్తుందా? అని ప్రశ్నించారు. అమ్ముడు పోయిన స్థానిక ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలని గ్రామాల్లో ప్రజలు డిమాండ్‌ చేయాలన్నారు. అమ్ముడు పోయిన స్థానిక ప్రజాప్రతినిధులు ఆ డబ్బును గ్రామ పంచాయతీల ఖాతాలో వేసి అభివృద్ధి చేస్తారా? అని నిలదీశారు.

తెరాస, భాజపాలు రెండు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ఆరోపించారు. స్టార్‌ క్యాంపెయినర్‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసే మునుగోడులో ప్రచారం చేస్తామన్నారు. పార్టీ మారే వారు తనపై విమర్శలు చేయడాన్ని కొట్టిపారేసిన రేవంత్‌.. కాంగ్రెస్‌ పార్టీ తన సొత్తు కాదని.. ఇక్కడ ఎంతో మంది సీనియర్లు ఉన్నారని, అందరికీ ప్రాధాన్యత ఉంటుందన్నారు. సమష్టి నిర్ణయాలతోనే ముందుకెవెళ్తామని వివరించారు. తాను చేసిన రెడ్డి వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదం లేదని, తాను మాట్లాడిన స్పీచ్‌ అంతా వింటే అర్థమవుతుందన్నారు. 

పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. డిండి ఎత్తిపోతల పథకానికి రూ.5వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. డిండి పథకం పూర్తి చేయకుండా మునుగోడు నియోజకవర్గానికి అన్యాయం చేశారని ఆక్షేపించారు. నియోజకవర్గంలో ఒక్క డిగ్రీ కాలేజీ లేదని.. కొన్ని మండలాల్లో జూనియర్‌ కాలేజీ లేదని తెలిపారు. పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి ఇప్పటికీ మునుగోడు ప్రజల గుండెల్లో ఉన్నారని రేవంత్‌ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్‌కు ప్రజలు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని