Revanth reddy: కాంగ్రెస్‌లో చేరిన వారికి టికెట్లు ఇస్తామని హామీ ఇవ్వట్లేదు: రేవంత్‌ రెడ్డి

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో దిల్లీలో కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మాణిక్కం ఠాగూర్‌ భేటీ అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో

Published : 06 Jul 2022 02:01 IST

దిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో దిల్లీలో కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మాణిక్కం ఠాగూర్‌ భేటీ అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో పరిస్థితులు.. ఇతర పార్టీల నుంచి నేతల చేరికలు, తెలంగాణలో రాహుల్‌ పర్యటన, పార్టీ బలోపేతంపై చర్చించారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఏడాది కాలంలో చేసిన పనులు, తెరాస, భాజపాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాటం అంశంపై నేతలు చర్చించారు. పార్టీలో సమస్యలను చర్చించి పరిష్కరించుకుంటామని, రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీలో భారీగా చేరికలు ఉంటాయన్నారు. కొత్తవారిని చేర్చుకున్నంత మాత్రాన పాతవారికి ప్రాధాన్యం తగ్గబోదన్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా.. తెరాస, భాజపా దోస్తీ బయటపడిందని పీసీసీ అద్యక్షుడు రేవంత్‌ వ్యాఖ్యానించారు.

‘‘ పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించాం. పార్టీలో చేరికలపై వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాం. జిల్లాలో పరిస్థితుల మేరకు నేతలను చేర్చుకుంటున్నాం. చేరికలపై ముందే తెలిస్తే కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరిన వారికి టికెట్లు ఇస్తామని అప్పుడే హామీ ఇవ్వట్లేదు. పార్టీ ప్రక్రియలో భాగంగా టికెట్లు కేటాయింపు ఉంటుంది. రాష్ట్రపతి అభ్యర్థిగా మమత ప్రతిపాదించిన పేరును కాంగ్రెస్‌ సమర్థించింది. రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు వేళ విపక్షాల భేటికి కేసీఆర్‌ డుమ్మా కొట్టారు. ప్రశాంత్‌ కిషోర్‌, భాజపా ప్రణాళికలో భాగంగానే కేసీఆర్‌ నాటకాలు ఆడుతున్నారు. రాష్ట్రాన్ని బెంగాల్‌ మాదిరిగా చేయాలని పీకే యత్నిస్తున్నారు. బంగాల్‌లో విపక్షాలన్నీ తుడిచిపెట్టుకుపోవడానికి పీకే కారణం. తెరాస అధికారంలోకి రావడానికి భాజపా సహాయం చేస్తుంది. విపక్ష పార్టీగా భాజపా ఉండాలని ప్రయత్నం చేస్తోంది. మొదట భాజపా సభ పూర్తయింది. తర్వాత తెరాస సభ పెడుతుంది. అనంతరం మూడో సభ కాంగ్రెస్‌ పార్టీ పెడుతుంది. కాంగ్రెస్‌ సభ ద్వారా ఎవరి బలమెంతో తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌ రెడ్డి లంచ్‌కు నన్ను కూడా ఆహ్వానించారు. హైదరాబాద్‌లో కార్యకర్తలను కలుపుకొని విష్ణు సభ పెడతానన్నారు. విష్ణు సభకు పీసీసీ అధ్యక్షుడిగా అన్ని అనుమతులు ఇచ్చా. జనార్దన్‌ రెడ్డి కుమారుడు పార్టీని వదిలే ప్రసక్తే లేదు. పార్టీ ఉన్నంతకాలం పార్టీతోనే విష్ణువర్దన్‌ రెడ్డి ఉంటారు. ఇతర పార్టీలోకి విష్ణు వెళ్తున్నారనేది దుష్ప్రచారం’’ అని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని