Congress: రాహుల్‌పై అనర్హత వేటు.. రాజకీయ కక్ష సాధింపే: రేవంత్‌ రెడ్డి

లోక్‌సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సభ్యత్వంపై వేటు వేయడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు తీవ్రంగా తప్పుబట్టారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యే అని మండిపడ్డారు.

Published : 24 Mar 2023 15:55 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీపై లోక్‌సభలో అనర్హత వేటు వేయడం దుర్మార్గమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. అదానీ అంశంపై చర్చ జరగకుండా ఉండేందుకే ఆయనపై వేటు వేశారని చెప్పారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘దేశంలో అప్రకటిత ఏమర్జెన్సీ ఉంది. మధ్యయుగం చక్రవర్తిలా మోదీ వ్యవహరిస్తున్నారు. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌పై అప్పీల్ చేసేందుకు రాహుల్‌ గాంధీకి 30రోజుల సమయం ఇచ్చారు. అయినప్పటికీ ఆయనపై అనర్హత వేటు వేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యే. జోడో యాత్రలో భాజాపా వైఫల్యాలను రాహుల్ ఎండగట్టారు. ముఖ్యంగా అదానీ కుంభకోణంపై ప్రశ్నిస్తున్నందుకే అనర్హత వేటు వేశారు’’ అని రేవంత్‌ మండిపడ్డారు. 

ప్రధాని నరేంద్రమోదీ ఇంటిపేరును కించపరిచేరీతిలో వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే. ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’ అని 2019లో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్‌ పరువునష్టం కేసు దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సూరత్‌ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. రాహుల్‌ అభ్యర్థన మేరకు ఈ కేసులో వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలుకు వీలుగా 30 రోజుల సమయం ఇచ్చింది. అయితే, ఏదైనా కేసులో నిందితులు దోషులుగా తేలిన తర్వాత జైలు శిక్ష పడినవారికి ప్రజాప్రతినిధిగా కొనసాగే అవకాశం ఉండదంటూ ప్రజాప్రాతినిధ్య చట్టంలో చేసిన మార్పులకు అనుగుణంగా లోక్‌సభ సచివాలయం రాహుల్‌పై అనర్హత వేటు వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని