Revanth Reddy: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌.. కార్ల యజమానులపై కేసులేవి?: రేవంత్‌

జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో కీలక విషయాలను పోలీసులు దాచి పెడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దిల్లీలో ఏర్పాటు

Published : 09 Jun 2022 01:17 IST

దిల్లీ: జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో కీలక విషయాలను పోలీసులు దాచి పెడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ కేసులో వాహన యజమానుల వివరాలను సీపీ సీవీ ఆనంద్‌ ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. వారిని ఎందుకు కాపాడాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

కార్ల యజమానులపై తీసుకున్న చర్యలేంటి?

‘‘ఈ కేసులో బాధితులు, నిందితులు ప్రయాణించిన బెంజి, ఇన్నోవా కార్లే కీలక ఆధారాలు. విచారణ అధికారులు ఈ కారులో ఉన్నవారు మైనర్‌లని చెబుతున్నారు. మైనర్‌లు  వాహనాలు నడిపినప్పుడు యజమానులు వాహనాలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. తక్షణమే యజమానులు పోలీసు అధికారులకు సమాచారం అందించాలి. మోటర్‌ వాహన చట్టం 133 ప్రకారం యజమానులకు నోటీసులు ఇచ్చి, వారిని పోలీస్‌స్టేషన్‌కు రప్పించి.. జరిగిన వివరాలు తెలియజేసి కేసు నమోదు చేయాల్సిన అవసరముంది. బెంజికారు పబ్‌ వరకు వెళ్లిన తర్వాత ఇన్నోవాలో బయల్దేరారని సీపీ సీవీ ఆనంద్‌ చెప్పారు. విచారణ అధికారిగా సీపీ మార్చి 20 నుంచి మే 28వ తేదీ సాయంత్రం సంఘటనలు జరిగినంత వరకు మాత్రమే విచారణ అంశాలను మీడియాకు వివరించారు. అసలు కథ మొదలైంది మే 28న 7.53 గంటల తర్వాతే. బాధితురాలిని తండ్రి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కార్లలో జరిగిన ఘటన, పెద్దమ్మ గుడి ప్రాంతంలో జరిగిన తంతంగ వివరాలు.. దీనికి సంబంధించిన వాహనాలు ఎక్కడివి, వావాహనాల యజమానులమీద తీసుకున్న చర్యలేమిటో సీవీ ఆనంద్‌ చెప్పకుండా కప్పిపుచ్చారు. ప్రభుత్వంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి అపాయింట్‌ చేసిన వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏ చిన్న ఘటన జరిగినా స్పందించే అసదుద్దీన్‌ ఒవైసీ ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. పొత్తులలో భాగస్వాములు, ఎన్నికల్లో భాగస్వాములు, ప్రభుత్వంలో భాగస్వాములు. చివరికి రేప్‌లు, మర్డర్లలో కూడా భాగస్వాములయ్యారు.

బెంజికారు ఎవరిదో సీపీ చెప్పలేదు...

బెంజికారు ఎంఐఎంకు సంబంధించిన వారిదని ఆరోపణలు వస్తున్నప్పడు సీవీ ఆనంద్‌ గారు మెర్సిడిస్‌ బెంజికారు యజమాని ఎవరో చెప్పలేదు. ఈ ఘటనలో ఉపయోగించిన కారు యజమానులను పోలీసులు పిలిచి విచారించారా? లేదా? ఎంవీ యాక్టు 133  ప్రకారం మైనర్లు కార్లు నడిపితే యజమానులకు నోటీసులు ఇవ్వాలి. మైనర్లు కార్లు నడపకపోతే ఘటనకు సహకరించిన వాహనాల యజమానులపై కూడా పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలి.  ఇన్నోవా కారు ప్రభుత్వ వాహనమని లోకమంతా కోడై కూస్తోంది. ఘటనకు ఉపయోగించింది ఇన్నోవా కారు అని సీవీ ఆనంద్‌ స్పష్టంగా చెప్పారు. ఇన్నోవా కారులో డ్రైవర్‌ లేరని స్పష్టంగా చెప్పారు. డ్రైవర్‌ లేనప్పుడు కారును నడిపింది మైనర్లు. మైనర్లందరూ కలిసి కారు పెద్దమ్మగుడి ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలో ఆపి ఒకరి తర్వాత ఒకరు రేప్‌ చేశారని చెప్పారు. వాహన యజమానుల వివరాలను సీవీ ఆనంద్‌ ఎందుకు దాచిపెడుతున్నారు. ప్రభుత్వ వాహనాన్ని అసాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తే కారుకు సంబంధించిన వివరాలను ఎందుకు కప్పిపుచ్చుతున్నారు.  అత్యాచారం కేసులో కీలక విషయాలను పోలీసులు దాచి పెడుతున్నారు. వారిని ఎందుకు కాపాడాలనుకుంటున్నారు. ఘటన జరిగిన తర్వాత ఏడు రోజుల పాటు ఇన్నోవా కారు ఎక్కడుంది? ఇన్నోవా కారుపై ఉన్న ప్రభుత్వ స్టిక్కర్‌ తొలగించారు. రేప్‌ ఘటనతో పాటు ఉద్దేశపూర్వకంగా ఆధారాలు చెరిపే ప్రయత్నం చేశారు. వాహనాన్ని ఎక్కడ స్వాధీనం చేసుకున్నారో పోలీసులు వెల్లడించలేదు’’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని