Revanth Reddy: కర్ణాటక ఫలితాలు.. దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతాయి: రేవంత్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ అహంకారం, అవినీతి సొమ్ముతో ఇతర రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెట్టి  ఏదో ఒకరకంగా అధికారాన్ని మూడోసారి నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 13 May 2023 17:14 IST

హైదరాబాద్‌: కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రేతో గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కుట్రలు, కుతంత్రాలతో జేడీఎస్‌ను గెలిపించి, హంగ్‌ అసెంబ్లీ ఏర్పాటు చేయడం ద్వారా భాజపా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన రాజకీయ పబ్బం గుడపుకోవాలనుకున్న కేసీఆర్‌ను కర్ణాటక ప్రజలు తిరస్కరించారు. బీఆర్‌ఎస్‌ కార్యక్రమాల్లో పాల్గొన్న కుమారస్వామిని కర్ణాటకకు ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్‌ ప్రకటించారు. కుమారస్వామి కర్ణాటకకు ముఖ్యమంత్రి కావాలంటే.. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడాలి. హంగ్‌ ఏర్పడినప్పుడే జేడీఎస్‌ పాత్ర అక్కడి రాజకీయాల్లో క్రియాశీలకమవుతుంది’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

‘‘కాంగ్రెస్‌ పార్టీ గెలవొద్దని ప్రయత్నించిన ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల ఆలోచనలను కర్ణాటక ప్రజలు విస్పష్టంగా తిరస్కరించారు. హైదరాబాద్‌ కర్ణాటకలోని మెజార్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. అక్కడి ప్రజల జీవన విధానంలోనే కాదు.. ఆలోచన సరళిలోనూ ఇక్కడి ప్రజలు పోలి ఉంటారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం కాబోతున్నాయి. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రతో మొదటి విజయం హిమాచల్‌ ప్రదేశ్‌లో, రెండో విజయం కర్ణాటకలో. మూడో విజయం తెలంగాణలో సాధించబోతున్నాం.

2024లో ఫైనల్‌లోగా దిల్లీలో కాంగ్రెస్‌ జెండా ఎగరేయబోతున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్‌ శ్రేణులు, నాయకులు ఉత్సాహంగా కలిసిమెలిసి ఎన్నికలను ఎదుర్కొన్నారు. అహంకారం ఒకవైపు, అవినీతి సొమ్ము మరో వైపు పెట్టుబడిగా పెట్టి భయపెట్టడం ద్వారా కాంగ్రెస్‌ను ఓడించాలని నరేంద్రమోదీ, భాజపా చేసిన కుట్రలను కన్నడ ప్రజలు తిప్పికొట్టారు. తెలంగాణలోనూ సీఎం కేసీఆర్‌ అహంకారం, అవినీతి సొమ్ముతో ఇతర రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెట్టి ఏదో ఒకరకంగా అధికారాన్ని మూడోసారి నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. భాజపా, భారాస ఒక్కటే అని ప్రజలు భావిస్తున్నారు’’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని