Revant Reddy: ‘కేసీఆర్‌ సర్కార్‌ రోజులు లెక్కబెట్టుకుంటోంది.. ఇంకా 99 రోజులే..!’

సీఎం కేసీఆర్‌ సర్కార్‌ రోజులు లెక్కబెట్టుకుంటోందని.. ఇంకా 99 రోజులే మిగిలి ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు.

Updated : 18 Sep 2023 19:12 IST

హైదరాబాద్‌: తెలంగాణకు సోనియా గాంధీ రాకతో భాజపా, భారాస, మజ్లిస్‌ ముసుగులు తొలగిపోయాయని.. ఆ మూడు పార్టీలూ ఒక్కటేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ రోజులు లెక్కబెట్టుకుంటోందన్న రేవంత్‌.. ఇంకా 99 రోజులే మిగిలి ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ విజయభేరి సభలో ఆదివారం ప్రకటించిన ఆరు హామీలనూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలుచేసి తీరుతామని స్పష్టంచేశారు. హామీల అమలులో పదేళ్ల కాంగ్రెస్‌, భారాస పాలనలను ప్రజలు పోల్చి చూడాలని కోరారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలన్నింటిలో పథకాల అమలుపై భారాస విమర్శల్ని తిప్పికొట్టిన ఆయన.. అక్కడి పరిస్థితుల ఆధారంగా ఒక్కో విధానం ఉంటుందన్నారు. 

పలువురు నేతలతో కలిసి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘2023 సెప్టెంబర్ 16, 17, 18 తేదీలు దేశ రాజకీయాల్లో చరిత్రాత్మకమైనవి. హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు, విజయభేరి సభ, కాంగ్రెస్ అభయహస్తం గ్యారంటీ కార్డులను ప్రజలకు చేరవేసే కార్యక్రమాలు ఈ మూడు రోజుల్లో జరిగాయి. ఈ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో విజయవంతం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ నేతలు, రాష్ట్ర స్థాయి నాయకులు, కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. భారాస నేతలు రాజకీయ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. బహురూపు వేషాలతో సమావేశాలను అడ్డుకోవాలని చూశారు. సోనియాగాంధీ తెలంగాణకు రావడంతో భారాస, భాజపా, ఎంఐఎంల ముసుగులు తొలగిపోయాయి. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇచ్చిన హామీలపై చర్చ పెట్టాలి. కేసీఆర్‌కు ఏటీఎంగా మారిన ధరణిని రద్దు చేసి తీరుతాం. ధరణిని రద్దు చేసి అంతకంటే మెరుగైన విధానాన్ని తీసుకొస్తాం’’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు