Revanth Reddy: ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్‌కు లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయబోతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు.

Updated : 27 Jun 2024 15:05 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయబోతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా మంచి విజయాలు సాధించానని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుభవాన్ని కాంగ్రెస్‌ పార్టీ వినియోగించుకుంటుందన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు.

జీవన్‌రెడ్డి సేవలను పార్టీ వినియోగించుకుంటుంది

‘‘జీవన్‌రెడ్డి అలక అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు చూశాయి. కాంగ్రెస్‌ పట్ల ఆయనకున్న నిబద్ధత వారికి అర్థం కాదు. సీనియర్‌ నేత అయిన ఆయన సేవలను పార్టీ వినియోగించుకుంటుంది. పీసీసీ అధ్యక్షుడి పదవీ కాలం మూడేళ్లు. కొత్త అధ్యక్షుడిని నియమించమని అధిష్ఠానానికి ఇదివరకే చెప్పాను. మంత్రివర్గ విస్తరణ గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారు. విద్యాశాఖ నా పరిధిలోనే ఉంది. ఇప్పటివరకు అన్ని పరీక్షలు సవ్యంగానే నిర్వహించా. నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. కేసీఆర్‌ ఒక్కరే ప్రమాణస్వీకారం చేసి మంత్రులను నియమించకపోయినా ఆనాడు మీడియా ప్రశ్నించలేదు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తాం. బడ్జెట్‌లో నిధుల కోసం కేంద్రమంత్రులను కలుస్తున్నాం. త్వరలో ప్రధాని మోదీని, కేంద్ర హోంమంత్రిని కలుస్తాం. 

ఏపీతో ఎలాంటి సమస్యలూ లేవు.. ఉన్నా పరిష్కరించుకుంటాం..

ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధే మా ధ్యేయం. తెలంగాణ ప్రజలకు రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయబోతున్నాం. ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని చెప్పి ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ఎన్నికలు పూర్తయ్యాయి. దానిపై విమర్శించడానికి భారాసకు అవకాశం లేకుండా పోయింది. శాంతిభద్రతలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో ఎలాంటి సమస్యలు లేవు. ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 

ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవడమే కేసీఆర్‌ భావదారిద్య్రం

పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్‌కు లేదు. దానికి పునాది వేసింది కేసీఆరే. గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆయన లాక్కున్నారు. ఆ విషయం ఆయనకు గుర్తులేదా? ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలి.. ముక్కు నేలకు రాయాలి. మా ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లోనే కూలిపోతుందని కేటీఆర్‌, హరీశ్‌రావు అన్నారు. వారి మాటలకు అప్పట్లో భాజపా వంతపాడింది. ప్రభుత్వాన్ని కూలగొడతామని భారాస, భాజపా రంకెలేశాయి. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవడమే కేసీఆర్‌ భావదారిద్య్రం. ఇప్పటికీ ఆయనకు కనువిప్పు కలగలేదు. పార్లమెంట్‌ ఎన్నికల్లో భారాస ఓటింగ్ 16 శాతానికి తగ్గింది. కాంగ్రెస్‌ను ఓడించేందుకు లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను కేసీఆర్‌ గెలిపించారు. కంచుకోటగా చెప్పుకొనే మెదక్‌లో భారాస మూడో స్థానంలో నిలిచింది. సిరిసిల్ల, సిద్దిపేటలో భాజపాకు అన్ని ఓట్లు పడ్డాయంటే అర్థమేంటి?

ఇన్నాళ్లూ ఎమ్మెల్యేలను దగ్గరకు రానివ్వని కేసీఆర్‌ ఇప్పుడు ఫామ్‌హౌస్‌ తలుపులు తెరిచారు. రాష్ట్రావతరణ దినోత్సవాలకు కేసీఆర్‌ను ఆహ్వానించాం. అక్కడ మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యుత్‌ కొనుగోళ్లపై విచారణ కోరింది భారాస ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డే. విచారణ కమిషన్‌ కేసీఆర్‌కు లేఖ రాయగానే విచారణ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రావతరణ వేడుకల్లో విపక్ష నేత మాట్లాడే సంప్రదాయం ఉందా?గతంలో మాకు కనీసం ఆహ్వానం కూడా లేదు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని