Revanth Reddy: మునుగోడులో కాంగ్రెస్ గెలుపు చారిత్రక అవసరం: రేవంత్‌రెడ్డి

మునుగోడు ఉపఎన్నికలో భాజపా, తెరాస గెలిస్తే ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో దిల్లీ నుంచి నిధులు తెస్తామని చెప్పిన భాజపా నేతలు.. ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు.

Published : 18 Oct 2022 01:21 IST

సంస్థాన్‌ నారాయణపురం: మునుగోడు ఉపఎన్నికలో భాజపా, తెరాస గెలిస్తే ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో దిల్లీ నుంచి నిధులు తెస్తామని చెప్పిన భాజపా నేతలు.. ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. ఉపఎన్నికల తర్వాత భాజపా నేతలు ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్‌, ఈటల రాజేందర్‌.. వారి నియోజకవర్గాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పాలని.. వారు తెచ్చిన నిధుల లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపఎన్నికలు జరిగినా హుజూర్‌నగర్‌, నాగార్జున సాగర్‌లో అభివృద్ధి జరగలేదన్నారు.

‘‘గతంలో కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప తెరాస కొత్తగా చేసిందేమీ లేదు. మునుగోడు బంగారుమయం కాలేదు.. గుంతల రోడ్ల మయంగా మార్చారు. బంగారు తెలంగాణలో మునుగోడు లేదా? కొత్తగా దత్తత పేరుతో కేటీఆర్ డ్రామాలాడుతున్నారు. కేసీఆర్‌ను సీఎం చేసింది రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయడానికి కాదా? ప్రశ్నిస్తున్న జనాన్ని రాజగోపాల్ రెడ్డి బెదిరిస్తున్నారు. ఓటు అడుక్కోవడానికి వచ్చి దౌర్జన్యం చేస్తారా? మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తేనే భయంతో తెరాస, భాజపాలు ఇచ్చిన హామీలు అమలు చేస్తాయి. మునుగోడులో కాంగ్రెస్ గెలుపు చారిత్రక అవసరం’’ అని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని