Revanth Reddy: సీఎల్పీ బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారు?.. పోలీసుల తీరుపై రేవంత్‌ ఆగ్రహం

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న సీఎల్పీ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి

Published : 17 Aug 2022 18:55 IST

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న సీఎల్పీ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి  సీఎల్పీ బృందాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. డిజైన్‌ లోపం ఉండడంతో గోదావరి వరదల కారణంగా పంప్‌ హౌస్‌లు నీట మునిగాయని.. తద్వారా  భారీగా నష్టం వాటిల్లిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఎలాంటి నష్టం జరగకపోతే సీఎల్పీ పర్యటనను ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. ప్రభుత్వమే దగ్గరుండి సీఎల్పీ బృందానికి కాళేశ్వరం పంప్ హౌస్‌లను చూపించాలని డిమాండ్‌ చేసిన రేవంత్‌.. లేని పక్షంలో కాంగ్రెస్‌ తరఫున  పోరాటం చేస్తామని హెచ్చరించారు.

సొమ్మసిల్లి పడిపోయిన భట్టి విక్రమార్క...

భూపాలపల్లిలో కాంగ్రెస్‌నేతల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. కాళేశ్వరం సందర్శనకు వెళ్తున్న సీఎల్పీ బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. హస్తం నాయకుల పర్యటనతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రాజెక్టు వద్దకు వెళ్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, సీతక్క తదితరులను అడ్డుకున్నారు. సందర్శనకు అనుమతి లేదని చెప్పడంతో నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఈక్రమంలో పోలీసులు, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్‌  నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సొమ్మసిల్లి పడిపోయారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts