Telangana News: నాటకాలాడితే.. రైతులు మీ రెండు పార్టీల మోసాలను గ్రహించలేరా?: రేవంత్‌రెడ్డి

తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో తెరాస ప్రభుత్వం సోమవారం దిల్లీలో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. మరోవైపు..

Published : 12 Apr 2022 01:23 IST

హైదరాబాద్‌: తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో తెరాస ప్రభుత్వం సోమవారం దిల్లీలో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. మరోవైపు.. ధాన్యాన్ని కొనాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. యాసంగి సీజన్‌లో ముందస్తుగా చేతికి వచ్చే ధాన్యం రా రైస్‌ కిందికే వస్తుందని.. అలా వచ్చే ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై సీఎం కేసీఆర్‌కు పది ప్రశ్నలతో కూడిన ఓ లేఖ రేవంత్‌ రెడ్డి విడుదల చేశారు.

తెలంగాణ నుంచి ఇక బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని 2021 అక్టోబరు 4న కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు ఉరితాళ్లు బిగిస్తూ కేంద్రానికి లేఖ రాసే అధికారం మీకు ఎవరిచ్చారు? అని మండిపడ్డారు. ఇప్పుడు ధర్నాలు, నిరసనలు అంటూ నాటకాలు ఆడితే రైతులు మీ రెండు పార్టీల మోసాలను గ్రహించలేరా అని ప్రశ్నించారు. ‘‘ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస చిత్తశుద్ధిపై రైతులకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్ల కారణంగా రూ.7500 కోట్లు నష్టం వచ్చినట్లు చెప్పి.. ఇకపై కొనుగోలు కేంద్రాలు ఉండవని గత ఏడాది ఫిబ్రవరిలో ప్రకటన చేయలేదా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాల కారణంగా ఇప్పటికీ రైతులు దళారుల చేతుల్లో నష్టపోతున్న విషయం నిజం కాదా? ప్రభుత్వం చేతులెత్తేయడంతో నిస్సహాయ స్థితిలో రైతులు తక్కువ ధరకే ధాన్యాన్ని మిల్లర్లకు అమ్ముకుంటున్నారు’’ అని ప్రశ్నలు సంధించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని