Revanth reddy: ఆ భయం వల్లే కేసీఆర్‌ పీకేను తెచ్చుకున్నారు..: రేవంత్‌

40లక్షల డిజిటల్‌ సభ్యత్వాలతో టి.కాంగ్రెస్‌తో దేశంలో నెంబర్‌వన్‌గా నిలిచిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వం పురోగతిపై

Updated : 05 Mar 2022 02:06 IST

హైదరాబాద్‌: 40లక్షల డిజిటల్‌ సభ్యత్వాలతో తెలంగాణ కాంగ్రెస్‌ దేశంలో నెంబర్‌ వన్‌గా నిలిచిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వం పురోగతిపై పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి  గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సభ్యత్వం తీసుకున్న 40లక్షల మంది అదనంగా ఒక్క ఓటు తీసుకొస్తే 80లక్షల ఓట్లు ఖాయమన్నారు. 80లక్షల ఓట్లు వస్తే గెలుపు సునాయాసమవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2లక్షల బీమా కల్పిస్తున్నామని, పర్యవేక్షణ కోసం పార్టీలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

కేసీఆర్‌... కాంగ్రెస్‌ సభ్యత్వాలు చూసి భయపడి ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే)ను తెచ్చుకున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు పీకే ఉంటే కాంగ్రెస్‌లో 40లక్షల ఏకే 47 లాంటి వారు ఉన్నారని రేంత్‌రెడ్డి అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ పక్షాన ఉన్నారని.. పార్టీ నాయకులు అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. నల్గొండ పార్లమెంట్‌ పరిధిలో సభ్యత్వం రికార్డు స్థాయిలో జరిగిందని, దేశంలోనే ఇది టాప్‌ అని వివరించారు.  పార్టీలో కష్టపడి పనిచేసే వారిని గుర్తించేలా సభ్యత్వ నమోదును ప్రామాణికంగా తీసుకుంటున్నామని తెలిపారు.  సభ్యత్వ నమోదులో  బాగా పనిచేసిన వారికి టికెట్‌ అవకాశాలు ఉంటాయన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా వాళ్లకు టికెట్‌ ఇచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. పనిచేయని వారికి టికెట్‌తో పాటు ఎలాంటి పదవి రాకుండా అడ్డుకుంటానని చెప్పారు. దీనిపై సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో మాట్లాడతానని తెలిపారు. ప్రతి బూత్‌ నుంచి వంద సభ్యత్వం ఉంటేనే ఆ నియోజకవర్గంలో పీసీసీ మెంబర్‌ ఉంటుందని, వంద సభ్యత్వం లేకుండా ఎంత పెద్ద నాయకుడు ఉన్నా పీసీసీ సభ్యత్వం ఇవ్వబోమని స్పష్టం చేశారు. టికెట్ల ఎంపికలో దిల్లీ నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారని, టికెట్ ఆశించిన వారు జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని