Updated : 10/08/2021 04:39 IST

TS news: దళితబంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయరెందుకు?: రేవంత్‌రెడ్డి

ఇంద్రవెల్లి: సీఎం కేసీఆర్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీల జీవితాలు చితికిపోతున్నాయని, ఆదివాసీల జీవితాలు మార్చాలనేదే కాంగ్రెస్‌ ప్రణాళిక అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల కోసమే పథకాలు తెచ్చానని సీఎం ఒప్పుకున్నారని చెప్పారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు ఎస్సీలు గుర్తుకొస్తారని, దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. రూ.4 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత, గిరిజన దండోరా బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఇంద్రవెల్లి పేరు స్మరిస్తే ఎంతో స్ఫూర్తి రగులుతుందని అన్నారు. స్వేచ్ఛ కోసం పోరాడి, ప్రాణాలిచ్చిన నేల ఇంద్రవెల్లి అని తెలిపారు. గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కుమురంభీమ్‌ గడ్డ ఇదేనన్నారు. నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుమురం భీం పోరాడారని గుర్తు చేశారు. 

ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌కూ అన్యాయం జరిగిందని రేవంత్‌రెడ్డి అన్నారు. అమరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్‌దేనని హామీ ఇచ్చారు. ‘‘ కాంట్రాక్టులు, కమీషన్ల ద్వారా రూ.వేల కోట్లను కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోంది. తెలంగాణకు ఎస్సీ నేతను తొలి సీఎం చేస్తానని కేసీఆర్‌ అన్నారు. ఎస్సీని ఉపముఖ్యమంత్రిని చేసి రెణ్నెళ్లకే తొలగించారు. కేసీఆర్‌ మంత్రివర్గంలో ఎస్సీలకు చోటు దక్కలేదు. కాంగ్రెస్ ఏం చేసిందని తెరాస నేతలు ప్రశ్నిస్తున్నారు.  దేశంలో దళితులను  రాష్ట్రపతితో పాటు అనేక  పదవుల్లో కూర్చోబెట్టాం. రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి పదవితోపాటు అనేక పదవులిచ్చింది  కాంగ్రెస్ పార్టీనే. రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున ఖర్గేను నిలబెట్టింది కాంగ్రెస్ కాదా?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు.

 దళితులకు చట్టసభల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని రేవంత్‌ గుర్తు చేశారు. ‘‘ రాజ్యాంగ నిర్మాతగా  అంబేడ్కర్‌ను  నియమించింది కాంగ్రెస్. రాష్ట్ర ఏర్పడితే దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని, లేదంటే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్‌ ఏం చేశారు. దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్య పంచె కడితే.. ఓర్వలేక అవినీతి ముద్రవేసి పక్కన పెట్టారు. ఇప్పటి వరకు రాజయ్య అవినీతి ఏమిటో తేల్చలేదు. ఇప్పుడు కేబినెట్ లో ఒక్క మాదిగకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఉప ఎన్నిక ఉందని హుజురాబాద్ లో దళితులకు రూ.10 లక్షలు అంటున్నారు. 118 నియోజకవర్గ లలో ఉప ఎన్నికలు రావాలి. అప్పుడే దళిత బంధు వస్తుంది’’ అని రేవంత్‌ అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఈ నెల 18న దళిత, గిరిజన దండోర మోగిస్తామన్నారు.

రాష్ట్ర ఖజానాను దోచుకుంటున్నారు

రాష్ట్ర ఖజానాను సీఎం కేసీఆర్‌ దోచుకుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజలను పక్కదోవ పట్టిస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఉద్యమ ఆశయాలను కేసీఆర్‌ ఏనాడో తొక్కేశారని మండిపడ్డారు. దళిత, గిరిజన దండోరా సభలో  భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘ అడవిని నమ్ముకున్న గిరిజనులను పోలీసులతో కొట్టిస్తున్నారు. దళితబంధును 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలి. దళిత బంధులాగే ఎస్టీలకు కూడా ఒక పథకం అమలు చేయాలి.’’ అని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, మధుయాష్కి, జీవన్‌రెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరయ్యారు. గుస్సాడి సంప్రదాయ రీతిలో కార్యకర్తలు నేతలకు స్వాగతం పలికారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని