Revanth Reddy: ఉద్యమకారులెవరో, దోచుకుంటున్నదెవరో అందరికీ తెలుసు: రేవంత్‌ రెడ్డి

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై అనుమానాలు ఉన్నాయని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆమెను ఇంటివద్దే విచారణ చేస్తామని సీబీఐ పేర్కొనడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

Updated : 24 Mar 2023 15:37 IST

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చాలా కాలం తర్వాత తెలంగాణ చైతన్యం కనిపిస్తోందని, ఉద్యమ స్ఫూర్తిని, పోరాట పటిమను ఏమాత్రం కోల్పోలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఇవాళ ఉస్మానియా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెజస అధ్యక్షుడు కోదండరామ్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్‌తో కలిసి రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్ధులను ఉద్దేశించి ఉద్వేగభరిత  ప్రసంగం చేశారు. తెలంగాణ సమాజంపై ఆధిపత్యం చలాయించాలని ఆలోచన చేసినప్పుడల్లా కొట్లాడిన గడ్డ ఓయూనేనని గుర్తు చేశారు. ఎవరు ఉద్యమకారులో, ఎవరు ఆ ముసుగులో దోచుకుంటున్నారో అందరికీ తెలుసన్నారు. సోనియా తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చారంటే అది ఈ బిడ్డల త్యాగాల ఫలితమేనని స్పష్టం చేశారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తానని చెప్పి తెరాస గద్దెనెక్కిందని.. మలిదశ ఉద్యమంలో అమరులైన 12వందల మంది కుటుంబాలకు ఆర్థిక సహాయం, 3 ఎకరాల భూమి, ఉద్యోగం ఏమీ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. 

550 మందికిపైగా అమరులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదన్న రేవంత్.. ఇంతకంటే అవమానకరం ఏమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులను చదువుకు దూరం చేయాలనే సింగిల్‌ టీచర్‌ పాఠశాలలను ప్రభుత్వం మూసేసిందని ఆరోపించారు. నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ లేకపోవడంతో యూనివర్శిటీలు వెలవెలబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటిని విశ్లేషించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో దుర్మార్గపు రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ఒకప్పుడు ఓయూలోకి అడుగు పెట్టాలంటే పోలీసులు భయపడేవారు, ఇప్పుడు నేరుగా విద్యార్థులు ఉంటున్న గదుల్లోకి వచ్చి నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే రక్తం చిందదన్నారు.. కానీ ఎన్‌కౌంటర్లే జరిగాయన్నారు. సామాజిక న్యాయాన్ని సీఎం కేసీఆర్‌ తుంగలో తొక్కారని, సామాజిక న్యాయం లేని రాష్ట్రం రాష్ట్రమే కాదని రేవంత్ వ్యాఖ్యానించారు.

కవిత విషయంలో సీబీఐ మెతక వైఖరి ఎందుకు?

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు  సీబీఐ నోటీసులు ఇవ్వడంపై అనుమానాలు ఉన్నాయని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆమెను ఇంటివద్దే విచారణ చేస్తామని సీబీఐ పేర్కొనడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కవిత విషయంలో సీబీఐ మెతక వైఖరి ఎందుకు ప్రదర్శిస్తుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. భాజపా, తెరాసలు పశ్చిమబెంగాల్‌ ఫార్ములాను అమలు చేస్తున్నాయని విమర్శించారు. వారి కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన ఫిర్యాదులన్నీ బుట్టదాఖలయ్యాయని రేవంత్‌ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని