Revanth reddy: పీకే సూచనలతోనే కేసీఆర్‌ కొత్త డ్రామాలు: రేవంత్‌రెడ్డి

వచ్చే 12 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లలో కేసీఆర్‌ సర్కారు చేయని పనులన్నింటినీ పూర్తి చేసి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు.

Updated : 13 Mar 2022 21:04 IST

కొల్లాపూర్‌: వచ్చే 12 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లలో కేసీఆర్‌ సర్కారు చేయని పనులన్నింటినీ పూర్తి చేసి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటికీ జలకళ తెస్తామన్న రేవంత్‌.. ఎస్సీ వర్గీకరణ సాధిస్తామని భరోసా ఇచ్చారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో జరిగిన ‘మన ఊరు-మన పోరు’ బహిరంగసభకు రేవంత్‌రెడ్డి సహా పలువురు సీనియర్‌నేతలు హాజరయ్యారు. బహిరంగసభ ప్రాంగణం పార్టీ కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. ఇదే ఊపుతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని రేవంత్‌ పునరుద్ఘాటించారు.

కాంగ్రెస్‌ ఎక్కడ ఉందన్నవారికి కొల్లాపూర్‌ సభ సమాధానం...

‘‘కాంగ్రెస్‌ ఎక్కడ ఉందని ప్రశ్నించిన వారికి కొల్లాపూర్‌ సభ సమాధానం చెబుతుంది. కొల్లాపూర్‌ రాజావారి బంగ్లా నుంచి కృష్ణమ్మ పొంగినట్టుగా జనం తరలివచ్చారు. ఎవరు మోసం చేసినా.. అన్యాయం చేసినా వేలాదిమంది తరలివచ్చి కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. మొన్న వనపర్తిలో కేసీఆర్‌ పెట్టిన సభ చూడండి.. కొల్లాపూర్‌ సభ చూడండి. పాలమూరులో కాంగ్రెస్‌ ఉందో, తెరాస ఉందో తెలుస్తుంది. కొల్లాపూర్‌ ప్రాంగాణానికి చేరుకోవడానికి 10గంటల సమయం పట్టింది. కాలికి బలపం కట్టుకొని 119 నియోజకవర్గాల్లో తిరుగుతా.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తా. శ్రీశైలం ముంపు బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఉమ్మడిపాలనలో తెలంగాణ కష్టం తీరదు.. రాష్ట్రం వస్తే తీరుతుందన్నారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చినా జీవో 98 పరిష్కారం కాలేదు. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేరుస్తానని చెప్పి మోసం చేశారు. ముదిరాజ్‌, బెస్తల జీవితాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? ఒక్క ముదిరాజ్‌ ఎదిగితే నిందలు వేసి బయటకు పంపారు. ఎస్సీ వర్గీకరణ సాధిస్తానని చెప్పి ఎస్సీలనూ మోసం చేశారు’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

సింపతీ కోసం కొత్త డ్రామాలు..

‘‘పాలమూరు గడ్డ మీద 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ సీట్లు గెలిస్తే వర్గీకరణ సాధ్యమవుతుంది. ప్రశాంత్‌ కిశోర్‌ సూచనలతో కేసీఆర్‌ కొత్త డ్రామాలు మొదలయ్యాయి. ఆసుపత్రికి వెళ్తే గతంలో ఎందుకు ఫొటోలు, వీడియోలు ఇవ్వలేదు. సింపతీ కోసం పీకే సలహాలతో డ్రామాలు మొదలయ్యాయి. అప్రమత్తంగా ఉండాలి. 12 నెలలు ఓపిక పట్టండి.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది. పాలమూరులో పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. 20 లక్షల ఎకరాలకు కాంగ్రెస్‌ నీరు అందిస్తుంది. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకోవడానికి కాంగ్రెస్‌కు ఓటెయ్యండి’’ అని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మాజీ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, సంపత్‌ కుమార్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు, భారీగా కార్యర్తలు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని