Revanth reddy: రాజ్‌భవన్‌ వేదికగా ఆ ఇద్దరూ డ్రామాకు తెరలేపారు: రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ చేసిన ప్రసంగంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్‌ను గవర్నర్‌ కాపాడే ప్రయత్నం చేశారన్నారు.

Updated : 04 Feb 2023 22:45 IST

హైదరాబాద్‌: గవర్నర్ పచ్చి అబద్ధాలతో సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీలో పొగిడే పని చేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తుంటే ఆ ఇద్దరు కలిసి నాటకాలకు తెర తీశారన్నారు. అందుకు రాజ్ భవన్‌ను వేదికగా వాడుకున్నారని విమర్శించారు. ఇప్పటివరకు అనేక విషయాల్లో కేసీఆర్ పనితీరును చెండాడిన గవర్నర్.. ఇప్పుడు స్వరం మార్చారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను గవర్నర్ కాపాడే ప్రయత్నం చేశారని.. ఆయన అబద్ధాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. భాజపా, భారాస విధానాలు ఒక్కటేనని తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నామన్నారు. 

కేటీఆర్ క్యాట్ వాక్, డిస్కో డాన్స్‌ల గురించి మాట్లాడుకుంటే మంచిదని రేవంత్‌ అన్నారు. దేశ భద్రత, సంస్కృతుల గురించి ఆయనకు తెలీదని విమర్శించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. కేసీఆర్‌కు ప్రజలు, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదన్న రేవంత్.. వారికి ఇవే చివరి ఎన్నికలన్నారు. అందుకే ఇవాళ కుమారుడికి గవర్నర్ ధన్యవాదాలు తెలిపేందుకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇచ్చారని దుయ్యబట్టారు. 

ఫిబ్రవరి 6న హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ ప్రారంభం..

ఫిబ్రవరి 6న ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారాలమ్మ నుంచి హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్ ప్రారంభించనున్నట్లు రేవంత్‌ ప్రకటించారు. రాచరికంపై పోరాడిన సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితోనే యాత్ర చేపడుతున్నట్లు వివరించారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకే యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. మండల పార్టీ కమిటీలు రద్దయ్యినట్లు గతంలో ప్రకటించామని, ఇప్పుడు అదే కమిటీల నేతృత్వంలో జోడో యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొత్త కమిటీలు వేసేవరకు ఇవే పనిచేస్తాయని చెప్పారు. నిర్దిష్ట కార్యాచరణ ఏమీ లేదని వారి వారి వెసులుబాటును బట్టి జాతీయ నాయకులు జోడో యాత్రలో పాల్గొంటారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని