Revanth Reddy: డ్రగ్స్‌ కేసులో ఎవరిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: రేవంత్‌రెడ్డి

మాదక ద్రవ్యాల కేసు విచారణ వివరాలను ఈడీకి ఇవ్వడంలో  రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ను

Updated : 11 Mar 2022 16:50 IST

హైదరాబాద్‌: మాదకద్రవ్యాల కేసు విచారణ వివరాలను ఈడీకి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ను కలిసిన రేవంత్‌... హైకోర్టు తీర్పు కాపీ, వినతి పత్రం ఆయనకు అందజేశారు. డ్రగ్స్‌ కేసు విచారణను ఈడీకి ఇవ్వాలని గతంలో రేవంత్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘‘రాష్ట్రంలో గుట్కా లేదు, మట్కా లేదు, గుడుంబా లేదు, పేకాట లేదు.. అని ఎన్నో సార్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. 2017 నుంచి విచారణ అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నా. డ్రగ్స్‌ మహమ్మారి విద్యాసంస్థల్లోకి చేరింది. డ్రగ్స్‌ గురించి నేను మాట్లాడితే హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పోతుందని కేటీఆర్, బాల్క సుమన్‌ లాంటి వాళ్లు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికారు. సింగరేణి కాలనీలో జరిగిన బాలికపై అత్యాచారం గంజాయి మత్తులో చేసింది కాదా? దూల్‌పేట గుడుంబా స్థావరాలపై దాడులు చేశారు కానీ, వారికి ప్రత్యామ్నాయం కల్పించలేదు.. అందుకే వాళ్లు గంజాయి అమ్ముతున్నారు, వాడుతున్నారు. స్కూల్స్‌ నుంచి కాలేజీల వరకు విచ్చలవిడిగా డ్రగ్స్‌ లభిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌ పరిధిలో కాంగ్రెస్‌ హయాంలో 4 పబ్‌లు ఉంటే ఇవాళ 90 పబ్‌లు ఉన్నాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది. 2017లో డ్రగ్స్‌ విచారణ ఏమయింది... ఎందుకు అటకెక్కింది? అకున్‌ సబర్వాల్‌ను అర్ధాంతరంగా ఎందుకు బదిలీ చేశారు? అప్పుడు 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.. ఏమయ్యాయి? ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేశా.. అయినా ముందుకురాలేదు. దీనిపై హైకోర్టుకు కూడా వెళ్లా.. తెలంగాణ యువత, ప్రజలను డ్రగ్స్‌ నుంచి కాపాడుకోవాలి. నైజీరియా నుంచి వచ్చిన వాళ్లు రాజ్యం ఏలుతున్నారు. ఈడీ అధికారులు విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వారి విచారణను వ్యతిరేకిస్తోందని ఈడీ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం సహకరించట్లేదని ఈడీ స్పష్టంగా చెప్పింది. ఎక్సైజ్‌ శాఖ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.. కానీ, ఈడీకి ఇవ్వట్లేదు. డ్రగ్స్‌ సరఫరా చేసేవాళ్లు, వాడిన వాళ్లు, అమ్మే వాళ్లు.. ఇలా 3 రకాల నేరస్థులు ఉన్నారు. గుజరాత్‌, ముంబై పోర్టుల్లో 100 క్వింటాళ్ల డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో స్వతంత్రంగా విచారణ చేయాలని కోరుతున్నా. మీరు సేకరించిన అన్ని ఆధారాలు, సాక్ష్యాలు వెంటనే ఈడీకి అందజేసి కోర్టు ఆదేశాలు పాటించండి. డ్రగ్స్‌ వాడే వాళ్లు ఎంత పెద్దవాళ్లయినా సరే చర్యలు తీసుకోండి. సినీ పరిశ్రమ ప్రముఖులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా... డ్రగ్స్‌ వాడకుండా చూడండి. 12 నెలల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది.. రాసిపెట్టుకోండి. అధికారంలోకి వచ్చాక డ్రగ్స్‌ దొంగల అంతు చూస్తాం’’ అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని