
అసంతృప్తులను బుజ్జగిస్తున్న రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్‌రెడ్డి ఎట్టకేలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొన్ని రోజులుగా రేవంత్‌రెడ్డిని కలవడానికి భట్టి విక్రమార్క నిరాకరిస్తూ వస్తున్నారు. పీసీసీ రేసులో ఉన్నప్పటికీ పదవి దక్కకపోవడంతో భట్టి విక్రమార్క అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన్ను దిల్లీకి పిలిపించి మాట్లాడింది. దిల్లి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్న భట్టి విక్రమార్కతో ఈరోజు ఉదయం సీనియర్ నేత మల్లు రవి చర్చలు జరిపారు. అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు ఎంత ముఖ్యమో సీఎల్పీ నాయకుడు అంతే ముఖ్యమన్నారు. ఆ తర్వాత మల్లు రవితో కలిసి రేవంత్‌రెడ్డి... భట్టి విక్రమార్కను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. రేపు గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.
భట్టి నివాసం వద్ద రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... పీసీసీ, సీఎల్పీ కాంగ్రెస్ పార్టీకి జోడెద్దుల్లా పనిచేసి కార్యకర్తల కష్టాలు తీరుస్తామని చెప్పారు. సోనియాగాంధీ ఏ లక్ష్యంతో తెలంగాణ ఇచ్చారో ఆ లక్ష్యాలను కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు. ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేకుండా, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా కేసీఆర్ పాలన సాగుతోందని ఆరోపించారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, నిరుద్యోగ యువత, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ వేదికగా పనిచేస్తామన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా ఆనాటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ లక్ష్యాలను చేరుకుందామని విజ్ఞప్తి చేశారు. అందుకోసం పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరముందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్‌రెడ్డి విజయాలు సాధించాలని కోరుతూ.. అభినందనలు తెలిపారు.
మర్రి శశిధర్‌రెడ్డితో రేవంత్ భేటీ
కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డిని రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్‌కు పీసీసీ పదవి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మర్రి శశిధర్‌రెడ్డి ఇటీవల పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఆదర్శ్‌నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాజీ మంత్రి శ్రీధర్ బాబును రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌ను శ్రీధర్ బాబు ఘనంగా సత్కరించారు. అసంతృప్తులను ఒక్కొక్కరిని కలుస్తున్న రేవంత్‌రెడ్డి.. వాళ్లను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కలిసి పనిచేస్తాం: జగ్గారెడ్డి
కాంగ్రెస్ సీనియర్‌నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సోనియాగాంధీ నాయకత్వంలో అంతా కలిసి చేస్తామని, నూతన అధ్యక్షుడికి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. గతంలో పరిస్థితులను మరచిపోయి ముందుకు సాగుతామన్నారు. గతంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డికి సహకరించినట్టే సహకరిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా జగ్గారెడ్డి తనకు మంచి మిత్రుడని, కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు.