Updated : 06 Aug 2022 19:52 IST

revanthreddy: ముఖాముఖిగా మోదీని నిలదీస్తేనే కేసీఆర్‌ను ప్రజలు నమ్ముతారు: రేవంత్‌

దిల్లీ: ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడానికి, నాయకులను వేధించడానికి కేంద్రంలో భాజపా, తెలంగాణలో తెరాస సర్కారు.. ప్రభుత్వ సంస్థలను వినియోగించుకుంటున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. దేశ భద్రతకోసం వినియోగించాల్సిన సంస్థలను రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి ఉపయోగించడం దారుణమన్నారు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో.. తెలంగాణలో విజిలెన్స్‌, ఏసీబీ, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖలను రాజకీయ అవసరాల కోసం కేసీఆర్‌ వాడుకున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు కేసీఆర్‌ పోలీసుల వ్యవస్థను వాడుకున్నారని విమర్శించారు. మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ ఒకే తాను ముక్కలని మండిపడ్డారు.

‘‘ప్రధాని మోదీ ప్రతిపక్ష పార్టీల సూచనలు పట్టించుకోవడం లేదని కేసీఆర్‌ చెబుతున్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రతిపక్ష నేతల సూచనలు వింటున్నారా? రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా కేసీఆర్‌కు సూచన చేస్తున్నా. రేపు దిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరవ్వండి. రాష్ట్రానికి సంబంధించిన  విభజన హామీలు, వరద నష్టం, నాలుగువేల మెగా వాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు, కాజీపేట కోచ్‌ ప్యాక్టరీ తదితర అంశాలను ప్రస్తావించండి. ప్రధాని మోదీని ప్రశ్నించే అవకాశం వచ్చినప్పుడు దుర్వినియోగం చేయొద్దు. సమావేశానికి హాజరై ప్రశ్నించడం ద్వారానే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రధాని మోదీని ముఖాముఖిగా నిలదీస్తేనే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. లేకపోతే కేంద్రానికి కేసీఆర్‌ లొంగిపోయినట్టేనని ప్రజలు భావిస్తారు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని