Rushikonda: రుషికొండ ప్యాలెస్‌ గుట్టు బయటపెడతాం: మంత్రి నారా లోకేశ్‌

విశాఖ తీరాన రుషికొండపై ప్రజాధనంతో నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారని తెదేపా ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు.

Published : 18 Jun 2024 06:41 IST

సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు

మంగళగిరి, తాడేపల్లి, న్యూస్‌టుడే: విశాఖ తీరాన రుషికొండపై ప్రజాధనంతో నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారని తెదేపా ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం ఉదయం నిర్వహించిన బక్రీద్‌ ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎక్కడెక్కడ ఇలాంటి విలాస భవనాలు నిర్మించారో వాటి గుట్టును సమగ్ర వివరాలతో ప్రజల ముందు ఉంచుతామన్నారు. మంగళగిరి నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 100 రోజుల్లో గంజాయిని నిర్మూలిస్తామని, ఈ మేరకు పోలీస్‌ అధికారులతోపాటు హోం మంత్రితో మాట్లాడానని చెప్పారు. ఒకపక్క వైకాపా వర్గీయులు తెదేపా కార్యర్తలపై దాడులు చేసి చంపేస్తూ.. మరోవైపు తెదేపాను విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. అధినేత చంద్రబాబు సూచనల మేరకు సంయమనం పాటిస్తున్నామని లేకుంటే తాము కూడా దీటుగా స్పందించగలమన్నారు. స్థానిక సమస్యలపై ఓ విలేకరి ప్రశ్నించగా.. పదేళ్లు పనిచేసిన ఎమ్మెల్యేను మీరెప్పుడూ అడగలేదు.. మేం వచ్చిన పది రోజులకే అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. తనను 91,413 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే ‘ప్రజా దర్బార్‌’ నిర్వహిస్తున్నానని, రోజూ 500 మందిని కలుస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆచరణలోకి తెస్తే బాగుంటుందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు