
fuel prise Rise: సైకిల్‌పై మార్కెట్‌కి వెళ్తున్నామా?
మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలు
ఇండోర్: ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్న ఇంధన ధరలతో జనం బెంబేలెత్తిపోతున్న వేళ భాజపా నేత, మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమ్నసింగ్ తోమర్ పలు సలహాలు ఇచ్చారు. కూరగాయల మార్కెట్‌కు సైకిళ్లపై వెళ్లడం ద్వారా ఫిట్‌నెస్, ఆరోగ్యంతో పాటు కాలుష్యం బారినుంచి కాపాడుకోవచ్చని వ్యాఖ్యానించారు. పెట్రో ధరల పెరుగుదలపై నిన్న ఇండోర్‌లో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. ‘‘గతంలోనే నేను విమర్శించాను. కానీ మళ్లీ చెబుతున్నా.. మనం ఎప్పుడైనా కూరగాయల మార్కెట్‌కు సైకిల్‌పై వెళ్తున్నామా? సైక్లింగ్ శారీరక దృఢత్వాన్ని ఇవ్వడంతో పాటు కాలుష్యం నుంచి కాపాడుతుంది. పెట్రోల్, డీజిల్ మనకు ముఖ్యమా? దేశం ఆరోగ్య సేవలా? గత 30 రోజుల నా డైరీని చూసినట్లయితే.. నేను కారులో ఎంత ప్రయాణిస్తున్నానో, సైక్లింగ్, నడక ఎంత చేస్తున్నానో అర్థమవుతుంది. ఇంధన ధరలు పెరుగుతున్నాయి.. కానీ దీనిద్వారా వస్తున్న డబ్బును పేదల సంక్షేమం కోసం వినియోగిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.
గత కొన్ని రోజులుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పరుగులు కొనసాగుతూనే ఉన్నాయి. భోపాల్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.107 మార్కును దాటేసింది. మరోవైపు, ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ జులై 7 నుంచి కాంగ్రెస్ పార్టీ 10 రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది.