Congress: 31న డప్పులు, గంటలు మోగించండి: వినూత్న నిరసనకు కాంగ్రెస్‌ పిలుపు

దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ఇంధన, నిత్యావసర ధరలపై కాంగ్రెస్‌ పార్టీ సమరానికి సిద్ధమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వరుసగా .....

Published : 27 Mar 2022 01:45 IST

దిల్లీ: దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్‌ సమరానికి సిద్ధమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వారం రోజుల పాటు వినూత్న నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 7 వరకు దేశ వ్యాప్తంగా దశల వారీగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అధిక ధరలకు నిరసనగా ఈ నెల 31న గురువారం ఉదయం 11గంటలకు దేశ ప్రజలంతా తమ ఇంటి ముందు, బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్‌ సిలిండర్లు ప్రదర్శిస్తూ.. డప్పులు కొడుతూ గంటలు మోగించాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా పిలుపునిచ్చారు. 

గత ఎనిమిదేళ్లలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం ద్వారా మోదీ సర్కార్‌ ప్రజల జేబుల్లోంచి రూ.లక్షల కోట్లు దోచుకుందని సూర్జేవాలా ఆరోపించారు. గత రెండేళ్లలోనే లీటరు పెట్రోల్‌ ధర రూ.29లు, డీజిల్‌ ధర రూ.28.58లు పెంచేశారని మండిపడ్డారు. గత ఎనిమిదేళ్లలో మోదీ సర్కార్‌ డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని 531శాతం, పెట్రోల్‌పై 203శాతం పెంచిందన్నారు. ఐదు రోజుల్లో నాలుగోసారి ఈరోజు లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 80 పైసలకు పైగా పెంచేశారని మండిపడ్డారు. ఐదు రోజుల్లోనే లీటరు పెట్రోల్‌పై రూ.3.20 వడ్డించారన్నారు. దీంతో సామాన్యులు, గృహిణులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు ప్రతిఒక్కరూ అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. 

మరోవైపు, కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీలు, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జిలతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషనల్‌) కేసీ వేణుగోపాల్‌ అధ్యక్షతన దిల్లీలో సమావేశం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న సభ్యత్వ నమోదు డ్రైవ్‌తో పాటు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రియాంకా గాంధీ, ఊమెన్‌ చాందీ, ముకుల్‌ వాస్నిక్‌, తారిక్‌ అన్వర్‌, రణ్‌దీప్‌ సూర్జేవాలా, అజయ్‌ మాకెన్‌, కోశాధికారి పవన్‌ కుమార్‌ బన్సల్‌ తదితర కీలక నేతలు హాజరయ్యారు. దేశంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం చవిచూసిన వేళ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టిసారించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని