TS News: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ క్రియాశీలపాత్ర పోషించాలి: తేజస్వీ యాదవ్‌

ఆర్జేడీ నేత, బిహార్‌లో ప్రతిపక్ష నాయుడు తేజస్వీ యాదవ్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. మంగళవారం ప్రగతిభవన్‌కు వచ్చిన తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని

Published : 12 Jan 2022 01:25 IST

హైదరాబాద్‌: భారతీయ జనతాపార్టీ వ్యతిరేక పార్టీలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంప్రదింపులు కొనసాగుతున్నాయి. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, ఆ రాష్ట్ర ప్రతిపక్షనేత తేజస్వి యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ బృందం ఇవాళ కేసీఆర్‌తో సమావేశమైంది. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వచ్చిన నలుగురు సభ్యుల బృందం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసింది. భాజపా విచ్ఛిన్నకర, అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక లౌకికశక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని తెరాస, ఆర్జేడీ నేతలు అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తోన్న భాజపాను గద్దె దింపే వరకు పోరాడాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా త్వరలో భవిష్యత్‌ కార్యాచరణ ఖరారు చేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. భాజపా వ్యతిరేక పోరాటం, జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని సీఎం కేసీఆర్‌ను లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తేజస్వి యాదవ్‌ కోరారు. ఆర్జేడీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. 

మాజీ సీఎం లాలూతో ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌..  ఆయన ఆరోగ్య, క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. తమ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చిందన్న విషయాన్ని లాలూ ఈ సందర్భంగా గుర్తు చేశారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు ముందుకు రావాలని కేసీఆర్‌ను లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆహ్వానించినట్టు సమాచారం. తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ, సాగునీటిరంగం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తేజస్వీయాదవ్‌ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. దేశ సమగ్రతను కాపాడే దిశగా జాతీయ రాజకీయాలను బలోపేత చేయాలని, అందుకోసం సాగే భాజపా వ్యతిరేక పోరాటంలో కలిసి సాగుతామని ఆర్జేడీ నేతలు చెప్పినట్టు తెలిసింది. అందుకు సీఎం కేసీఆర్‌ ప్రధానపాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అన్నట్టు సమాచారం. ఉత్తర్‌ ప్రదేశ్‌ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై నేతలు చర్చించినట్టు తెలిసింది. తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్రమంత్రి కేటీఆర్‌, ఆర్జేడీ నుంచి మాజీ మంత్రి  అబ్దుల్‌ భారి సిద్దిఖీ, ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌, మాజీ ఎమ్మెల్యే భోలా యాదవ్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు