RJD: అవును మోదీజీ.. మీరు చెప్పింది నిజమే..ఇప్పుడదే చేశాం..!

భాజపాను వీడి, ప్రత్యర్థి పార్టీ ఆర్జేడీతో చేతులు కలిపారు జేడీ(యూ) అగ్రనేత నీతీష్‌ కుమార్. దీనిపై భాజపా గుర్రుగా ఉంది.

Published : 10 Aug 2022 14:43 IST

పట్నా: భాజపాను వీడి, ప్రత్యర్థి పార్టీ ఆర్జేడీతో చేతులు కలిపారు జేడీ(యూ) అగ్రనేత నీతీష్‌ కుమార్. దీనిపై భాజపా గుర్రుగా ఉంది. ఇది ఓటర్ల తీర్పును అవమానించడం కిందికే వస్తుందని మండిపడింది. ఈ సమయంలో 2017లో ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌ను ఆర్జేడీ గుర్తుచేసింది. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం బిహార్‌ ప్రజలకు ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉందంటూ అప్పుడు ట్విటర్‌లో మోదీ పోస్టు చేశారు.

‘అవును సర్.. మీరు చెప్పింది నిజమే. బిహార్ సరిగ్గా ఇప్పుడు అదే చేసింది. భాజపా మంత్రులు కేంద్రం, రాష్ట్రాల్లో బురద చల్లుత్తున్నారు. కొందరు(ఆర్‌ఎస్‌ఎస్) కర్రలు, కత్తులు ఊపుతూ వీధుల్లో తిరుగుతున్నారు. ప్రజాస్వామ్యానికి తల్లి వంటి బిహార్‌.. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు దేశం చేస్తోన్న డిమాండ్ కూడా ఇదే’ అని ఆర్జేడీ ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చింది. 

నీతీశ్ కుమార్‌ తన రాజకీయ ప్రయాణంలో భాజపా, ఆర్జేడీతో పొత్తులు పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 2013లో భాజపాతో తెగదెంపులు చేసుకున్నారు. అనంతరం 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేసి, గెలుపొందారు. 2017 మధ్యవరకు ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని నడిపించారు. కానీ ఆ తర్వాత ఆ బంధం ముక్కలైంది. కొద్దిగంటల్లోనే భాజపాతో కలిసి, మరోసారి బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మళ్లీ ఇప్పుడు కమలం పార్టీకి కటీఫ్ చెప్పి, లాలూ పార్టీతో దోస్తీకట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని