UP Polls 2022: ప్రధాని మోదీ సభ రద్దుపై జయంత్‌ చౌధురి వ్యంగ్యాస్త్రాలు!

యూపీలో ఎన్నికల గడువు సమీపిస్తున్నవేళ రాజకీయ రణక్షేత్రంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భాజపా, సమాజ్‌వాదీ పార్టీ- ఆర్‌ఎల్‌డీ కూటమిల మధ్య నువ్వా నేనా......

Published : 08 Feb 2022 01:26 IST

నోయిడా: యూపీలో ఎన్నికల గడువు సమీపిస్తున్నవేళ రాజకీయ రణక్షేత్రంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భాజపా, సమాజ్‌వాదీ పార్టీ- ఆర్‌ఎల్‌డీ కూటమిల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు కొనసాగుతోంది. దీంతో ఇరు పక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షమైన ఆర్‌ఎల్‌డీ చీఫ్‌ జయంత్‌ చౌధురి ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పశ్చిమ యూపీలోని బిజ్నోర్‌లో వర్ధమాన్‌ కళాశాల మైదానంలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార సభ జరగాల్సి ఉంది. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా రద్దు చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత మోదీ వర్చువల్‌గా పాల్గొని సభలో ప్రసంగించారు.

ఈ పరిణామంపై జయంత్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. బిజ్నోర్‌లో సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు.. కానీ ‘భాజపాకు ప్రతికూల వాతావరణం’ అంటూ వ్యంగ్య బాణాలు వదిలారు. అంతేకాకుండా ప్రతికూల వాతావరణం ఉండటంతో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనాల్సిన భౌతిక ర్యాలీ రద్దయినట్టు టీవీలో వచ్చిన స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేశారు. అలాగే, ఈరోజు బిజ్నోర్‌లో సూర్యుడు మండుతున్నట్టుగా వాతావరణం పొడిగా ఉన్నట్టు ఉన్న గూగుల్‌ వెదర్‌ రిపోర్టును సైతం తన ట్వీట్‌కు జత చేశారు. యూపీలో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్‌ జరగనుండగా.. ఉత్తరాఖండ్‌ సరిహద్దుకు సమీపంలో ఉండే ఈ బిజ్నోర్‌ ప్రాంతంలో ఫిబ్రవరి 14న పోలింగ్‌ జరగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని