Pinnelli: పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్లు

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై మాచర్ల పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు. వీరితోపాటు నియోజకవర్గ పరిధిలోని 150 మందిపై కేసులు నమోదుచేశారు.

Updated : 17 Jun 2024 06:45 IST

రామకృష్ణారెడ్డిపై 14 కేసుల నమోదు

కారంపూడి, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై మాచర్ల పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు. వీరితోపాటు నియోజకవర్గ పరిధిలోని 150 మందిపై కేసులు నమోదుచేశారు. పిన్నెల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎన్నికల రోజు, తర్వాత రోజు జరిగిన ఘర్షణల్లో పాల్గొన్నారు. రామకృష్ణారెడ్డికి వెన్నుదన్నుగా ఉంటూ ప్రతి ఘర్షణలో సోదరుడు వెంకటరామిరెడ్డి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆయనపైనా రౌడీషీట్‌ తెరిచారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇదే నేరప్రవృత్తి కలిగి ఉండటం, పోలీసు రికార్డుల్లో ఉన్న కేసులు, పోలీసు కేసులు నమోదుకాకుండా చేసిన ఘటనల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో శాసనసభ్యునిగా పనిచేసిన వ్యక్తిపై రౌడీషీట్‌ తెరవడం ఇదే మొదటిసారి.

ఎన్నికల రోజున..

మే 13 ఎన్నికల రోజున మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొని పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. రెంటచింతల మండలం రెంటాలలో తెదేపా కార్యకర్తలపై దాడులు చేయించడంతో పాటు పోలింగ్‌ ఏజెంట్‌గా ఉన్న చేరెడ్డి మంజులపై గొడ్డలితో దాడిచేసి గాయపరిచారు. ఇదే మండలంలోని పాల్వాయిగేటు పోలింగ్‌ బూత్‌లో రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టి అడ్డువచ్చిన నంబూరి శేషగిరిరావుపై అనుచరులతో దాడి చేయించారు. ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను దుర్భాషలాడుతూ బెదిరించారు. వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడెం, కండ్లకుంట గ్రామాల్లో రిగ్గింగ్‌కు పాల్పడుతూ అడ్డువచ్చిన మాణిక్యాలరావు, రేఖ్యానాయక్‌పై కత్తులు, కర్రలతో దాడులు చేయించారు. మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలోని తెదేపా నేత కేశవరెడ్డి ఇంటిపైకి దాడికి వెళ్లి అడ్డొచ్చిన ఐదుగురిపై కారు ఎక్కించడంతో పాటు వారిపై అనుచరులతో దాడులు చేయించి తీవ్రంగా గాయపరిచారు.

ఎన్నికల తర్వాత రోజు..

మే 14న కారంపూడి మండలంలో రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి కర్రలు, కత్తులు, ఇనుపరాడ్లతో వీరవిహారం చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న తెదేపా అనుచరుల దుకాణాలు ధ్వంసం చేశారు. ఈ దమనకాండ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో రాగా ఒక్కసారిగా పల్నాడు ప్రాంతం ఉలిక్కిపడింది. 

నమోదైన కేసులు 

పిన్నెల్లి సోదరులపై ఎన్నికల నేపథ్యంలోనే కాకుండా అంతకుముందూ కేసులున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎన్నికల ఘర్షణల్లో రౌడీషీట్‌ తెరిచేందుకు 14 కేసులు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా పాల్వాయిగేటులో నంబూరి శేషగిరిరావుపై దాడి, హత్యాయత్నం, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి, కేపీగూడెంలో రేఖ్యానాయక్‌పై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ కేసు, పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వంసం వంటి కేసుల్లో నిందితుడిగా చేర్చి రౌడీషీట్‌ తెరిచారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి, హత్యాయత్నం,  మాచర్లలో పీడబ్ల్యూడీ కాలనీలో కారుతో ముగ్గురిని తొక్కించి చంపడానికి ప్రయత్నించడం, మరో ఇద్దరు ముస్లిం యువకులపై కర్రలు, గొడ్డళ్లతో దాడులు చేయించి హత్య చేసేందుకు ప్రయత్నించడం వంటి మరో ఐదు కేసుల్లో నిందితుడిగా పేర్కొంటూ రౌడీషీట్‌ తెరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని